నలుగురు పోతే ఏంటి.. 4వేల మందిని తయారు చేసే శక్తి టీడీపీకి ఉంది

నలుగురు పోతే ఏంటి.. 4వేల మందిని తయారు చేసే శక్తి టీడీపీకి ఉంది

టీడీపీ రాజ్యసభపక్షం బీజేపీలో విలీనంపై రాజకీయ దుమారం రేపుతోంది. విలీన ప్రక్రియ నిబంధనలకు విరుద్ధమంటూ టీడీపీ నేతలు ఆగ్రహాం వ్యక్తం చేస్తోంటే.. అంతా రాజ్యాంగ బద్ధంగానే జరిగిందంటూ కమల దళం కౌంటర్ ఇస్తోంది. గతాన్ని మరిచి టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, నలుగురు ఎంపీలు పోయినా.. నాలుగువేల మందిని తయారు చేసే శక్తి టీడీపీకి ఉందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్మళ్లు.

ఆంధ్రప్రదేశ్‌లో తమ బలం పెంచుకునేందుకు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీసింది. ఇందులో భాగంగానే టీడీపీ నేతలను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహన్ని అమలు చేస్తోంది. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఇప్పటికే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజ్యసభలో సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకు వారిని చేర్చుకున్నామంటూ బీజేపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. అయితే ఆ నలుగురు ఎంపీల చేరికతో ఏపీలో రాజకీయం ఇప్పుడు బీజేపీ వర్సెస్‌ టీడీపీలా మారింది. ఒకరిపై ఒకరు మాటలతో యుద్ధాలు చేసుకుంటున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఆ నలుగురు పార్టీ మారారని తెలుగు తమ్మళ్లు మండిపడుతున్నారు. టీడీపీ రాజ్యసభపక్షం బీజేపీలో విలీనం చెల్లదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ నేతల వ్యాఖ్యలపై అటు బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. రాజ్యాంగంలోని 10 షెడ్యూల్‌ ప్రకారమే విలీన ప్రక్రియ జరిగిందని పేర్కొంటున్నారు.. ఏ సభలోనైనా మూడో వంతు సభ్యులు విలీనం చేయాలని కోరితే అది చట్టవిరుద్ధం కాదని అంటున్నారు. టీడీపీ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీన ప్రక్రియ పూర్తిగా రాజ్యాంగబద్ధంగానే జరిగిందన్నారు హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. దీనిపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.

అయితే, నలుగురు ఎంపీలు పార్టీ వీడినంత మాత్రన టీడీపీకి ఎలాంటి నష్టం లేదని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. స్వార్థ నేతలు పోయినా.. కార్యకర్తలు పార్టీ వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నలుగురు ఎంపీలు పోతే నాలుగు వేల మంది తయారుచేసే శక్తి టీడీపీకి ఉందంటున్నారు.

మొత్తంగా బీజేపీ, టీడీపీ మధ్య జరుగుతున్న వలసల యుద్ధం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.. అయితే, త్వరలోనే మరికొంతమంది నేతలు కాషాయ కండువా కప్పుకోబోతున్నారంటూ లీక్‌లు ఇస్తున్నారు బీజేపీ నేతలు. అదే జరిగితే దీనిపై టీడీపీ ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story