ప్రజావేదిక కూల్చివేత నిర్ణయంపై స్పందించిన టీడీపీ

ప్రజా వేదికను కూల్చివేస్తామనడం సరికాదని టీడీపీ సమన్వయ కమిటీ అభిప్రాయపడింది. ప్రజల అవసరాల కోసం నిర్మించిన భవనాన్ని ఎలా కూల్చేస్తారంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం ప్రజా వేదిక అంశం కోర్టు పరధిలో ఉంది.. అలాంటప్పుడు కూల్చివేస్తామనడం సరికాదని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రం అయిన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం హాట్‌హాట్‌గా సాగింది.. ఈ సమావేశానికి పొలిట్‌ బ్యూరో సభ్యులు యనమల, చినరాజప్ప, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరై.. వైసీపీ తీరుపై మండిపడ్డారు..

గత 50 ఏళ్లలో ఆ ప్రాంతం ముంపునకు గురైన దాఖలాలు లేవని, అలాంటప్పుడు ప్రజా వేదిక కూల్చివేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ప్రజా వేదికను కూల్చేస్తామని ప్రకటన చేసిన వ్యక్తి అక్కడే ఎందుకు కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసారని టీడీపీ నేతలు నిలదీశారు. టీడీపీ మీద కక్ష సాధించేందుకే వైసీపీ ఇలా చేస్తోందని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కరకట్టపై అనేక కట్టడాలు ఉన్నాయని, అవన్ని తొలగిస్తారా అని నిలదీశారు.. ఏపీ సీఎం జగన్‌ అప్పుడే ఇచ్చిన హామీలపై పిల్లి మొగ్గలు వేస్తున్నారని సమన్వయ కమిటీ అభిప్రాయపడింది.

వైసీపీ అధికారం చేపట్టాక టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి గురైన బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పాలని సమన్వయ కమిటీ తర్మానించింది. అవినీతి కేసుల ఆరోపణలు ఎదుర్కుంటోన్న ఏపీ సీఎం జగన్ అవినీతి వ్యతిరేకమని ప్రకటనలు చేయడం హాస్యస్పదంగా ఉందన్నారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. 12 కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్‌కు చెందిన 40 వేల కోట్ల రూపాయల ఆస్తులను ఈడి సీజ్ చేసిందని గుర్తు చేశారు. జగన్‌ కేబినెట్‌ ఉన్న బొత్స, అవంతిలపైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు.

Tags

Read MoreRead Less
Next Story