Telugu States: అప్పులు చేయడంలో తెలుగు రాష్ట్రాలే టాప్‌.. సర్వేలో వెల్లడి..

Telugu States: అప్పులు చేయడంలో తెలుగు రాష్ట్రాలే టాప్‌.. సర్వేలో వెల్లడి..
Telugu States: ఈ ఆర్థిక సంవత్సరం సంబంధించి ఆర్బీఐ నుంచి స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ తీసుకున్న రాష్ట్రాల్లో ఏపీ టాప్..

Telugu States: అప్పు చేసి పప్పు కూడు అన్న చందంగా మారింది తెలుగు రాష్ట్రాల పరిస్థితి. అవసరానికో అప్పు చేయడంలో తెలుగు రాష్ట్రాలు టాప్‌లో నిలిచాయి. అప్పులు తీసుకోవడంలో దేశంలో ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పోటీపడి మరీ దూసుకుపోతున్నాయి. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేస్తున్నాయి. దేశంలో అత్యధిక రోజులు అప్పులు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ టాప్‌లో నిలిచింది.

2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్బీఐ నుంచి స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ తీసుకున్న రాష్ట్రాల్లో ఏపీ టాప్ ప్లేస్‌లో ఉంది. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, ఓవర్ డ్రాఫ్ట్ రూపంలోనూ ఎక్కువ రోజులు రుణం తీసుకున్న రాష్ట్రం ఏపీనే. తక్షణ అవసరాల కోసం ఈ రుణం తీసుకుంది. గత ఏడాదిలో 305 రోజుల పాటు ఎస్డీఎఫ్, 283 రోజులు డబ్ల్యూఎంఏ, 146 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ సౌకరాన్ని ఏపీ ప్రభుత్వం ఉపయోగించుకుంది.

ఐసీఆర్ఏ సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇక ఏపీ తర్వాత ఎక్కువ రోజులు అప్పులు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ సెకండ్ ప్లేస్‌లో, మూడో స్థానంలో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఉంది. ఎస్డీఎఫ్, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఎంత ఎక్కువగా వాడితే.. ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతగా దిగజారినట్లేనని ఆర్థిక నిపుణుల అంచనా. దీంతో తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ఎకనమిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 17 రాష్ట్రాలు ఎస్డీఎఫ్, 14 రాష్ట్రాలు WMA, తొమ్మిది రాష్ట్రాలు ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా అప్పులు తీసుకున్నాయి. యూపీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, ఒడిశా,అసొంతో పాటు పేద రాష్ట్రంగా పిలుచుకునే బీహార్ సైతం ఎలాంటి రుణం తీసుకోలేదు. ఇక బెంగాల్, మహారాష్ట్రలు ఒక్క రోజు మాత్రమే స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నాయి.

అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లోనూ కొన్ని.. SDF, WMA, ఓడీలో.. ఏదో ఒక సౌకర్యాన్ని వాడుకున్నాయి. కొన్ని రాష్ట్రాలు రెండింటిని ఉపయోగించుకున్నాయి. ఆరు రాష్ట్రాలు మాత్రం మూడింటిని వాడుకుని.. రుణం తీసుకున్నాయి. ఇందులో ఏపీ మొదటి స్థానంలోనూ.. తెలంగాణ రెండో స్థానంలో ఉన్నాయి. ఈ సౌకర్యాల ద్వారా అప్పులు తీసుకుంటే.. వడ్డీ రూపంలో ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆర్థికంగా రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు మూడు సౌకర్యాలను ఉపయోగించుకుని రుణం తీసుకోవడం అత్యంత ఆందోళకరమని చెబుతున్నారు. ఇది ముందుముందు సంక్షోభానికి దారి తీయవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే తెలుగు ప్రజలు శ్రీలంక సంక్షోభ పరిస్థితులను గమనిస్తున్నారు. తిండి లేక అక్కడ జనాలు చనిపోతున్నారు. ఎక్కడ శ్రీలంక తరహా ఆర్థిక పరిస్థితులు తలెత్తుతాయా అన్న కలవరం జనాల్లో కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story