ఖజానా నింపుకునేందుకేనా ఈ ప్లాన్.. జగన్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు

ఖజానా నింపుకునేందుకేనా ఈ ప్లాన్.. జగన్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు
జగన్‌ మాట తప్పారు.. మడమ తిప్పారు. ఇప్పుడు పేదల నోట ఇదే మాట వినిపిస్తోంది.

జగన్‌ మాట తప్పారు.. మడమ తిప్పారు. ఇప్పుడు పేదల నోట ఇదే మాట వినిపిస్తోంది. ఎన్టీఆర్‌ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లపై పేదలు తీసుకున్న అప్పును మాఫీ చేస్తానని ఎన్నికలప్పుడు ఘనంగా హామీ ఇచ్చిన జగన్.. ఇప్పుడు రివర్స్‌లో వాటికి డబ్బులు వసూలు చేస్తామనడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. చంద్రబాబు హయాంలో కట్టించిన టిడ్కో ఇళ్లకు ఇచ్చిన రుణాలను సైతం మాఫీ చేస్తానని జగన్‌ వాగ్ధానం చేశారు.

తీరా చూస్తే వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పేరుతో ఇప్పుడు పేదలపై కొత్త భారం మోపుతున్నారు. ఆనాడు పైసా చెల్లించకుండానే రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన జగన్.. ఇవాళ పేదలకు తీపి కబురు అంటూ వేలకు వేలు కట్టించుకునేందుకు రంగం సిద్ధం చేయడం విమర్శలకు తావిస్తోంది.

ఆనాడు ఎన్నికల ప్రచారంలో జగన్‌ ఏమని హామీ ఇచ్చారో చూద్దాం.

చంద్రబాబు హయాంలో కట్టిన ఇళ్లే కాదు.. అప్పుడెప్పుడో 30-40 ఏళ్ల క్రితం ఇచ్చిన ఇళ్లకు కూడా డబ్బులు కట్టాలనడం పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఇళ్లకు అసలు తాము బాకీ ఉన్నామనే విషయమే మరిచిపోయిన పేదలకు.. లేదు లేదు మీరు ప్రభుత్వానికి అప్పు ఉన్నారంటూ గుర్తుచేసి మరీ.. రిజిస్ట్రేషన్ పేరుతో వేల రూపాయలు కట్టించుకోవాలని చూస్తున్నారు. దీంతో కొన్నేళ్లుగా ఎన్టీఆర్ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లల్లో ఉంటున్న పేదలంతా తప్పనిసరిగా డబ్బులు కట్టాల్సిన పరిస్ధితి ఏర్పడుతోంది. నిన్నటి కేబినెట్‌లో దీనిపై తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కలకలం రేపుతోంది.

ఎన్టీఆర్ హయాంలో ఇళ్లు కట్టుకున్న వారి దగ్గర్నుంచి మొన్నటి చంద్రబాబు కట్టించిన టిడ్కో లబ్దిదారుల వరకు ప్రభుత్వానికి బాకీ ఉన్నారట. ఎప్పుడో 1983లో పేదల ఇళ్లపై ఇచ్చిన అప్పును సెటిల్‌ చేస్తామంటూ జగన్ కొత్త స్కీమ్‌ తీసుకొచ్చారు. పైగా ఇది పేదలకు జగన్ ప్రభుత్వం కల్పిస్తున్న సాంత్వన, ఊరట అంటూ చెప్పడం చూసి పేదలు భగ్గుమంటున్నారు. ఎన్టీఆర్‌ హయాం నుంచి ప్రభుత్వం ఇస్తున్న ఇళ్లు, వాటిల్లో బతుకుతున్న వాళ్లకు.. ఆ ఇళ్లు వాళ్లవి కావనే ఉద్దేశాన్ని ప్రజలపై రుద్దుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

40 ఏళ్లుగా ఉంటున్న ఇళ్లను మీ పేరు మీదకే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామంటూ కొత్త పలుకులు పలుకుతుండడం చూసి పేదలు ఆశ్చర్యపోతున్నారు. అంటే.. ఇన్నాళ్లు తాము ఉంటున్న ఇళ్లు తమవి కావా అనే ఓ భయంలోకి జగన్ ప్రభుత్వం నెట్టేసింది. అలాంటి భయాలు పోయి.. హ్యాపీగా బతకాలంటే కేటగిరీని బట్టి 10వేల రూపాయల నుంచి 40వేల రూపాయలు కడితే.. వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిస్తామని చెబుతున్నారు. జగన్‌ మాట తప్పి, మడమ తిప్పడంపై టీడీపీ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతోంది.

గ్రామాల్లోని పేదలు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లల్లో ఉంటుంటే పదివేలు కట్టాలి. అదే పట్టణాల్లోని వాళ్లైతే 15వేలు చెల్లించాలి. నగరాల్లోని వాళ్లైతే ఏకంగా 20 వేలు సమర్పించుకోవాలి. అది కూడా వాస్తవ లబ్దిదారులు అయితేనే. ఒకవేళ పేదల ఇళ్లను ఎవరైనా కొనుక్కుని ఉంటే ఇంతకు రెండింతలు చెల్లించాలి. అంటే గ్రామాల్లోని వాళ్లు 20వేలు, పట్టణాల్లోని వాళ్లు 30వేలు, నగరాల్లోని వాళ్లు 40వేలు కట్టాలి. ప్రభుత్వం నిర్దేశించిన సొమ్ము చెల్లిస్తేనే వాళ్ల పేరు మీద రిజిస్ట్రర్ అవుతుందని మెలిక పెట్టారు.

దీనివల్ల ఊళ్లో ఓ పది మంది డబ్బులు కడితే.. మిగిలిన పేద వాళ్ల మీదా ఒత్తిడి పెరుగుతుంది. ఏమో.. మా ఇళ్లు మాకు ఉండవేమోనన్న భయంతో అప్పోసొప్పో చేసి వాళ్లూ డబ్బులు కట్టేస్తారు. ఎలా చూసుకున్నా పేదల నుంచి రమారమి 10వేల కోట్ల రూపాయలు వసూలు చేయబోతోంది జగన్ ప్రభుత్వం. హీనపక్షంలో 5వేల కోట్లైనా వస్తాయని అంచనా వేస్తోంది. పైగా డిసెంబర్ 15 లోపు పేదలు డబ్బు కట్టాల్సిందేనని డెడ్‌లైన్‌ పెట్టడంతో.. డిసెంబర్‌లోనే ఖజానాలోకి 10వేల కోట్ల రూపాయల వరకు పేదల డబ్బు వచ్చి చేరనుంది.

ఏపీలో దాదాపు 47 లక్షల మంది పేద ప్రజలు.. ప్రభుత్వానికి అప్పు ఉన్నారని చెబుతోంది జగన్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌ గృహ నిర్మాణ సంస్థ వద్ద 46 లక్షల 61వేల మంది ఇంటి స్థలం తనఖా పెట్టారని పేదలకు గుర్తుచేస్తోంది. ఈ 47 లక్షల మంది పేదలు.. 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు 9వేల 320 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారని జగన్ చెబుతున్నారు. తీసుకున్న అప్పు, వడ్డీ కలిపి పేద ప్రజలు 14వేల 609 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారని నిన్న క్యాబినెట్‌ సమావేశం తేల్చింది. ఈ అప్పు మొత్తాన్ని మాఫీ చేసేస్తానని చెబుతున్నారు జగన్. కాకపోతే, తలా పదివేలు, విజయవాడ, విశాఖ, తిరుపతి లాంటి నగరాల్లోని వాళ్లైతే 40వేలు కడితే చాలు అంటోంది.

వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకం కింద పేదలు డబ్బులు చెల్లిస్తేనే, వారికి ఇంటి స్థల పత్రాలను అప్పగించడంతోపాటు వారి పేర్లతోనే రిజిష్ట్రేషన్‌ చేసి ఇస్తామంటోంది ప్రభుత్వం. అప్పుడే ఆ ఇళ్లపై పేదలకు పూర్తి హక్కులు వస్తాయని జగన్ ప్రభుత్వం డైరెక్టుగా చెబుతోంది. పైగా పేదలతో డబ్బు కట్టించే ఈ కార్యక్రమానికి.. గృహ రుణం నుంచి పేదలకు విముక్తి అనే పేరు పెట్టి.. ఓ భారీ సభను ఏర్పాటు చేసే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సభ ద్వారా డబ్బులు కట్టిన పేదలకు రిజిస్ట్రేషన్‌ కాగితాలు ఇవ్వాలనేది జగన్‌ ప్లాన్‌గా కనిపిస్తోంది. ఏదేమైనా ఖజానా నింపుకోడానికి జగన్‌ దిమ్మ తిరిగే ప్లాన్‌ వేశారంటూ విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు.

వన్‌ టైమ్‌ సెటిల్మెంట్‌- OTS కింద చెల్లింపులు చేయడానికి ప్రభుత్వం డిసెంబర్‌ 15కి డెడ్‌లైన్‌గా పెట్టింది. అలా డబ్బులు కట్టిన వారికి డిసెంబర్‌ 21న ఇంటి స్థలం పత్రాల్ని అప్పగిస్తారు. వారి పేర్లతో రిజిస్ట్రేషన్ చేయిస్తారట. గ్రామ, వార్డు స్థాయిలో లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వాళ్లకు ఈ వన్‌సైట్‌ సెటిల్మెంట్‌ పథకంపై అవగాహన కల్పిస్తారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ గృహ రుణాల వన్‌టైమ్‌ సెటిల్మెంట్‌ పథకం పేదలకు తీపి కబురని గొప్పగా చెప్తున్నారు. దీన్ని ప్రధాన ప్రతిక్షం టీడీపీ సహా మిగతా పార్టీలన్నీ తీవ్రంగా తప్పు పడుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story