నేడు టీటీడీ పాలక మండలి సమావేశం.. టీటీడీ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి

నేడు టీటీడీ పాలక మండలి సమావేశం.. టీటీడీ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి
టీటీడీ 2021-22 వార్షిక బడ్జెట్‌కు ఇవాళ ఆమోద ముద్ర పడనుంది.

నేడు తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. టీటీడీ 2021-22 వార్షిక బడ్జెట్‌కు ఇవాళ ఆమోద ముద్ర పడనుంది. కరోనా నేపథ్యంలో సుమారు 81 రోజుల పాటు భక్తులకు దర్శనం నిలిపివేయడంతో.. పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో సవరించిన అంచనాల బడ్జెట్ ఎంత ఉంటుంది అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బడ్జెట్‌ కు అమోద ముద్ర వేయడంతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు టీటీడీ బోర్డు సభ్యులు.

గత ఏడాది హుండీ, ఇతర మూలధనం ద్వారా సుమారు 1351 కోట్లు, వడ్డీల ద్వారా 706 కోట్లు, ప్రసాదాల విక్రయాల ద్వారా 400 కోట్లు, దర్శన టికెట్ల ద్వారా 245 కోట్లు వస్తాయని టీడీడీ అధికారులు భావించారు. అయితే కరోనా నేపథ్యంలో వీటికి కోత పడింది. మరోవైపు నిరర్ధక ఆస్తుల విక్రయాల ద్వారా సుమారు 100 కోట్లు ఆర్జించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారు. దీనిపై వివాదం తలెత్తడంతో టీటీడీ అధికారులు వెనక్కి తగ్గారు. దీంతో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని.. రానున్న ఆర్దిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

మరోవైపు టీటీడీ నగదును సప్తగిరి బ్యాంక్‌లో డిపాజిట్ చేయడంపై బోర్డులో చర్చించనున్నారు. మార్చి నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని టీటీడీ భావించింది. అయితే కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో దీనిపై చర్చించి అనుమతిపై పునరాలోచన చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే తెలుగు అకాడమీకి తిరుపతిలోని తుమ్మలగుంటలో భవనాన్ని కేటాయించేందుకు నిర్ణయం తీసుకోనున్నారు.

తిరుమలలో పొరుగు సేవల విధానంలో పనిచేస్తున్న 139 మంది ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన తీసుకునే అంశపైనా బోర్డు సభ్యులు చర్చించనున్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు సంబంధించిన విధివిధానాలపై టేబుల్ అజెండా చర్చించనున్నారు. ఇక టీటీడీ విజిలెన్స్ విభాగంలోకి 300 మంది మాజీ సైనికులను కాంట్రాక్ట్ పద్దతిన విధుల్లోకి తీసుకునేందుకు పాలక మండలిలో చర్చ జరగనుంది.


Tags

Read MoreRead Less
Next Story