అత్యుత్సాహంతో విజయసాయిరెడ్డి ట్వీట్.. ఆపై భంగపాటుతో డిలీట్‌..

అత్యుత్సాహంతో విజయసాయిరెడ్డి ట్వీట్.. ఆపై భంగపాటుతో డిలీట్‌..

ఇండియాలో ఏ వ్యాక్సినూ బయటకు రాలేదు. విదేశాల నుంచీ వ్యాక్సిన్లు తెప్పించడం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ల పంపిణీ ఎప్పుడు మొదలుపెడతామో చెప్పలేదు. కేవలం పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలంటూ మాత్రమే చెప్పింది. కాని, విజయసాయిరెడ్డి మాత్రం మరో 9 రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. తెలంగాణలో జనవరి తరువాత వ్యాక్సినేషన్ ఉంటుందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ప్రకటించారు. ఏపీలో ఇప్పటి వరకు వ్యాక్సినేషన్‌పై ఎటువంటి ప్రక్రియ జరగలేదు. కాని, డిసెంబర్ 25 నుంచి ఏపీలో కరోనా టీకాలు వేస్తామని ప్రకటించారు. జగన్ ఆదేశాలతో 4762 ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరుగుతుందని విజయసాయి ప్రకటించారు.

ఏపీలో కరోనా వ్యాక్సిన్లు ఇచ్చే బృహత్‌ కార్యక్రమం ప్రారంభం అవుతుందంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసేశారు విజయసాయిరెడ్డి. నిజానికి రాష్ట్రంలోనే కాదు కదా.. దేశంలోనే వ్యాక్సినేషన్‌ జరిగే పరిస్థితులు లేవు. వ్యాక్సిన్ అంటూ వస్తే.. ముందు ప్రాధాన్యతా క్రమంలో టీకాలు ఇవ్వాల్సి ఉంటుంది. కాని, ఏకంగా కోటి మందికి టీకాలు వేయించడానికి రెడీగా ఉన్నామని చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి. ఇదంతా విజయసాయిరెడ్డి అత్యుత్సాహంతో పెట్టిన ట్వీటేనంటూ టీడీపీ విమర్శిస్తోంది. అసలు వ్యాక్సినేషన్ విషయం రాష్ట్ర ఆరోగ్య మంత్రికైనా తెలుసా అంటూ ప్రతిపక్షం ఎద్దేవా చేస్తోంది. పైగా జగన్‌గారి ఆదేశాలతో అంటూ ట్వీట్ చేయడం వల్ల సీఎం జగన్‌ను కూడా ఈ అంశంలో ఇరికించారంటూ విమర్శిస్తోంది టీడీపీ.

భారత్‌లో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్లు ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నాయి. ప్రముఖంగా మూడు కంపెనీలు టీకా తయారీలో నిమగ్నమై ఉన్నాయి. వీటికి డీసీజీఏ అనుమతి రావాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా ఇంకా కొనసాగుతూనే ఉంది. పైగా వ్యాక్సిన్లు పంపిణీ చేయాలంటే ప్రత్యేక పరిస్థితులు ఉండాలి. భారీ ఎత్తున ఫ్రీజర్లు కావాల్సి ఉంటుంది. అవన్నీ రాష్ట్రంలో ఉన్నాయో లేవో తెలీదు. ఎక్కడ స్టోర్ చేస్తారనేది ఆరోగ్య శాఖ అధికారులకు కూడా తెలీదు. కాని, మరో 9 రోజుల్లో టీకాలు వేయించేస్తామంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేయడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హైదరాబాద్‌ కేంద్రంగా భారత్‌ బయోటెక్ కొవాగ్జిన్ తయారుచేస్తోంది. పైగా మూడో దశ ప్రయోగాల్లో ఉంది. ఈ వ్యాక్సిన్‌పై భారత్‌ ఎన్నో ఆశలు పెట్టుకుంది కూడా. కొవాగ్జిన్‌పై యావత్ భారతదేశం ఎదురుచూస్తోందని భారత్‌ బయోటెక్‌కు కూడా తెలుసు. అయినప్పటికీ.. ఫలానా తేదీన వ్యాక్సిన్‌ విడుదల చేస్తున్నామని ఇంత వరకు ప్రకటించలేదు. భారత్ బయోటెక్కే కాదు.. దేశంలోని ఏ కంపెనీ కూడా వ్యాక్సిన్ రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు. కాని, విజయసాయి రెడ్డి మాత్రం ఏకంగా వ్యాక్సినేషన్ తేదీనే ప్రకటించారు. డిసెంబర్ 25 నుంచి కోటి మందికి కరోనా టీకాలు వేస్తామంటూ ట్వీట్ చేశారు. వెంటనే నాలుక కరుచుకున్నారో ఏమో.. ట్విట్టర్‌ నుంచి ఆ పోస్టును తీసేశారు విజయసాయిరెడ్డి.


Tags

Read MoreRead Less
Next Story