విశాఖలో సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయ వేడి

విశాఖలో సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయ వేడి

విశాఖ తూర్పు నియోజకవర్గంలో సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయ వేడి రగులుతోంది. ఈస్ట్‌ పాయింట్‌లోని సాయిబాబా ఆలయం వేదికగా రాజకీయ రచ్చ జరుగుతోంది. బినామీ భూములపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రామకృష్ణాపురం, కృష్ణాపురం గ్రామాల్లో ఆక్రమణల పేరుతో పేదలభూముల్లోకి వెళ్లి ప్రహారీగోడలు కూల్చడం, వారి పాకల్ని ధ్వంసం చేయడంతో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు వారికి అండగా నిలబడ్డారు. స్వయంగా పర్యటించి వారికష్టాలు తెలుసుకున్నారు.

ఇది సహించని వైసిపీ, తొలగించిన భూములు వెలగపూడి బినామీలేనని ఆరోపణలు చేయడంతో... వివాదం రాజుకుంది. ఏకంగా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డే ఈ ఆరోపణలు చేయడంతో వెలగపూడి అందుకు ధీటుగా స్పందించారు. తన ఇష్ట దైవం షిరిడీ బాబా సాక్షిగా విజయసాయిరెడ్డి సమక్షంలోనే ప్రమాణం చేస్తానని, ఈస్ట్ పాయింట్ కాలనీలో వున్న బాబా ఆలయానికి ఎప్పుడు రమ్మంటే అప్పుడే వస్తానని సవాలు విసిరారు.

ఎంపీ విజయసాయిరెడ్డికి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సవాల్‌ విసరగా.. ఆ సవాల్‌పై విజయసాయిరెడ్డి స్పందించకుండా.. స్థానిక వైసీపీ నేతలంతా రియాక్ట్‌ అయ్యారు. ఇప్పటికే తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల హల్‌చల్‌ చేశారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ సైతం స్పందించడం విశేషం. ఆయన తన అనుచరులతో కలిసి గాజువాక నుంచి సాయిబాబా ఆలయానికి చేరుకున్నారు. అయితే.. కేవలం విజయసాయిరెడ్డి వస్తేనే... తాను సవాల్‌ స్వీకరిస్తానని వెలగపూడి ఇప్పటికే స్పష్టం చేసి ఉండటంతో... వెనుదిగిరిపోయారు గుడివాడ అమర్నాథ్‌.

వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ వ్యాఖ్యలకు టీడీపీ నేతలు కౌంటర్‌ ఇచ్చారు. విశాఖలో భూ కబ్జాలు చేయడానికే విజయసాయిరెడ్డి వచ్చారంటూ మండిపడ్డారు. వెలగపూడి సవాల్‌ విసిరింది విజయసాయిరెడ్డికైతే ఎమ్మెల్యే అమర్నాథ్‌ ఎందుకు స్పందించారంటూ నిలదీశారు. అనవసర వ్యక్తులు తెరమీదకొచ్చి హంగామా చేయడం మానుకోవాలన్నారు. సాయిబాబా ఆలయానికి టీడీపీ నేతలు ప్రసాద్‌, పోతనరెడ్డి, ప్రవీణ్‌ గోపాల్‌ ర్యాలీగా బయలుదేరారు.. అయితే, టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. పోలీసులు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.. 144 సెక్షన్‌ టీడీపీ శ్రేణులకేనా అంటూ నిలదీశారు.. వైసీపీ నేతల ర్యాలీకి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని టీడీపీ నేతలు మండిపడ్డారు.

శాంతిభద్రతల సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన అధికారపార్టీ నేతలు, ప్రజాప్రతినిధులే రెచ్చగొట్టే సవాళ్లు చేయడం బాధాకరమంటున్నారు విశాఖ ప్రజలు. అధికారంలో వున్నవారు సంయమనం పాటించి సమస్యకు పరిష్కారం చూపడం పోయి ఏం చేసినా చెల్లుతుందనే ధోరణిలో ఉండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story