నిర్మాణం పూర్తైన ఇళ్లు ఇవ్వడానికి ఇబ్బందేంటి? : ప్రతిపక్షాలు

నిర్మాణం పూర్తైన ఇళ్లు ఇవ్వడానికి ఇబ్బందేంటి? : ప్రతిపక్షాలు

రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన టిడ్కో గృహాలను పేదలకు ఇవ్వాలంటూ సీపీఐతో పాటు టీడీపీ నిరసన చేపట్టాయి. ఈ క్రమంలో పలువురు సీపీఐ నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విజయవాడలో ఇళ్ల ముట్టడికి ప్రయత్నించిన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లబ్దిదారులకు ఇళ్లు ఇవ్వమని అడిగితే అరెస్ట్‌ చేస్తారా అని మండిపడ్డారు సీపీఐ నేతలు. నిర్మాణం పూర్తైన ఇళ్లు ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.

విశాఖలోని మిథిలాపూర్‌ కాలనీలో టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించేందుకు సీపీఐ విఫలయత్నం చేసింది. సుద్దగడ్డ రజక కాలనీలో నిర్మించిన ఇళ్లలో గృహప్రవేశాలకు సీపీఐ నేతలు పిలుపునిచ్చారు. అయితే అప్పటికే అక్కడికి పోలీసులు చేరుకుని వారిని అడ్డుకున్నారు.

అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా... ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా కట్టలేదంటూ వైసీపీ సర్కారుపై విరుచుకుపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. కనీసం టీడీపీ హయంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను పేదలకు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. సంక్రాంతిలోగా టిడ్కో ఇళ్లను పేదలకు అప్పగించాలని లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని నిమ్మల హెచ్చరించారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పోనంగిలో లబ్దిదారులకు టిడ్కో ఇళ్లను అప్పగించేందుకు యత్నించిన సీపీఐ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తుగా పలువురు నాయకులను హౌస్‌ అరెస్ట్‌ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

కర్నూలు జిల్లాలోనూ టిడ్కో ఇళ్ల స్వాధీనం కోసం సిద్ధమైన సీపీఐ, ఏఐటీయూసీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కొంతమంది నాయకులను బయటకు రాకుండా గృహనిర్బంధం చేశారు. అక్రమ అరెస్టులను వామపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు.

తుళ్లూరు టిడ్కో నివాసాల వద్దకు వస్తున్న సీపీఐ నేతలను అరెస్ట్‌ చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో సీపీఐ నేతలను అదుపలోకి తీసుకుని టిడ్కో గృహాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

టిడ్కో గృహాల్లోకి వెళ్లేందుకు పిలుపునివ్వడంతో అటు తిరుపతిలోని సీపీఐ కార్యాలయానికి తాళాలు వేశారు పోలీసులు. కార్యాలయానికి వచ్చిన పేదలను, సీపీఐ కార్యకర్తలను అడ్డుకున్నారు. లోపల ఉన్నవారు బయటకు రానివ్వడంలేదు. దీంతో పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా పార్టీ ఆఫీసులోనే టిడ్కో ఇళ్ల లబ్ది దారులు, సీపీఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

ఇళ్లు ఇవ్వమని అడిగిన వామపక్షాల నేతలను హౌస్ అరెస్టు చేయడంపై అమరావతి మహిళలు మండిపడ్డారు. ప్రభుత్వం ఇళ్లను ఇవ్వదు.. గృహప్రవేశం చేయనివ్వదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇళ్ల కోసం పేదలు వడ్డీకి డబ్బులు తెచ్చి కడితే ప్రభుత్వం ఇళ్లు ఇవ్వకుండా జాప్యం చేయడం దారుణమన్నారు. వెంటనే అర్హులైన వారికి ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story