ఏపీ సర్కారుకు వరల్డ్‌ బ్యాంక్‌ బంపర్‌ ఆఫర్‌

ఏపీ సర్కారుకు వరల్డ్‌ బ్యాంక్‌ బంపర్‌ ఆఫర్‌

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి 300 మిలియన్ డాలర్ల రుణాన్ని రద్దు చేసిన ప్రపంచ బ్యాంక్.. జగన్ సర్కారుకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆరోగ్యం, వ్యవసాయం, విద్యుత్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌లో ఒక బిలియన్‌ డాలర్ల రుణసాయాన్ని అందిస్తున్నట్లు తెలిపింది. ఏపీ సర్కారు కోరితే మరింత సాయం అందిస్తామని తెలిపింది. అయితే కేంద్రం సూచనతోనే.. ఇటీవల రుణ ప్రతిపాదనను రద్దు చేసుకున్నట్లు తెలిపింది.

ఏపీ రాజధాని అమరావతి విషయంలో తప్పుకున్నామని చెబుతున్న ప్రపంచ బ్యాంక్.. ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యం, వ్యవసాయం, విద్యుత్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగాల్లో ఒక బిలియన్ డాలర్ల రుణ సాయం యధావిధిగా కొనసాగుతోందని తెలిపింది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరితే తప్పకుండా సాయం చేస్తామని స్పష్టత ఇచ్చింది. వరల్డ్ బ్యాంకుకు ఆంధ్రప్రదేశ్‌తో ఎంతో సుధీర్ఘమైన భాగస్వామ్యం ఉందంటోంది.

అమరావతి సుస్థిర మౌలిక వసతులు, సంస్థాగత అభివృద్ధి ప్రాజెక్టు కోసం రుణం ఇవ్వాలని గతంలో ప్రపంచ బ్యాంకుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే.. కేంద్రం చేసిన సూచనల మేరకే అమరావతికి రుణ ప్రతిపాదన రద్దు చేసినట్లు తాజాగా ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. ఆ ప్రతిపాదన ఉపసంహరించుకుంటూ ఈ నెల 15న కేంద్రానికి లేఖ రాసినట్లు వెల్లడించింది. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ద్వారా తమకు ప్రతిపాదనలు పంపితే పరిశీలించి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో 328 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం అందించేందుకు గతనెల 27న తాము ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన విషయాన్ని ప్రకటనలో ప్రస్తావించింది. ఇప్పటికే ఈ అంశపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరుగుతోంది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకోగా.. అది తారాస్థాయికి చేరుకుంది.

Tags

Read MoreRead Less
Next Story