సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వైసీపీ నేత ఆడియో..!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వైసీపీ నేత ఆడియో..!
ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో ఇదే. పోలింగ్ ముందు రోజే ఇతర నియోజకవర్గాల నుంచి కిరాయి ఓటర్లను రప్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా దీన్ని బట్టి తెలుస్తోంది.

తిరుపతి ఉపఎన్నికల్లో దొంగ ఓట్లకు పక్కాగా ప్లాన్ చేసింది ఎవరు..? ఇప్పటికే ఈ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వేల మంది ఓటర్లను భక్తుల ముసుగులోనూ, మరో కారణం చెప్తూ ఎవరు తరలించారో అందరికీ అర్థమైపోయింది. తాజాగా తిరుపతి బైపోల్‌లో దొంగ ఓట్లు వేయించే విషయంపై జరిగిన ఓ ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. MLA చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఓ వ్యక్తితో మాట్లాడిన ఆడియో అంటూ చక్కర్లు కొడుతోంది. ఆదేంటో మీరు కూడా వినండి.

ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో ఇదే. పోలింగ్ ముందు రోజే ఇతర నియోజకవర్గాల నుంచి కిరాయి ఓటర్లను రప్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా దీన్ని బట్టి తెలుస్తోంది. బస్సుల్లో ఓటర్లను తరలించడం, అందుకు ఎన్ని బస్సులు అవసరం అనే దానిపై వారి మధ్య చర్చ జరిగింది. 450 మంది ఓటర్లను తరలించేందుకు ఏడు బస్సులు కాదు.. 9 బస్సులు కావాలంటూ చెవిరెడ్డి చెప్తున్నట్టు అందులో ఉంది.

ఎన్నికల సందర్భంగా చెకింగ్స్ ఉంటాయి కాబట్టి.. ఇతర నియోజకవర్గాల నుంచి ఓటర్లను తరలించడం కష్టమనే అభిప్రాయం కూడా వారి మాటల్లో వ్యక్తమైంది. చివరికి.. 450 ఓట్లేగా మేము వేసేసుకుంటాం.. అంత దూరం నుంచి జనం ఎందుకు..? వాళ్ల ఓట్లు, ఆ 450 ఓట్లు ఎవరో ఒకరితో వేయించేసుకుంటాంలే అనే మాటలు కూడా అందులో వినిపించాయి. ఐతే.. MLA చెవిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడింది వైసీపీ నేతనా లేదంటే ప్రభుత్వ అధికారా అనే దానిపై పూర్తి స్పష్టత లేదు.

తిరుపతిలో 2 లక్షల మంది దొంగ ఓటర్లను చేర్చారని విపక్షాలు ముందు నుంచే ఆరోపిస్తున్నాయి. ఇది చాలదన్నట్టు పోలింగ్ రోజు.. ఇతర ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి కూడా బస్సుల్లో ఓటర్లను తరలించి ఓట్లు వేయించారని టీడీపీ, బీజేపీ నేతలు మండిపడ్డారు. పోలింగ్ రోజు కొన్ని కేంద్రాల్లో దొంగ ఓట్లు వేస్తున్న వారిని పట్టుకుని స్వయంగా పోలీసులకు అప్పగించారు. ఈ దొంగ ఓటర్ల తరలింపు వెనుక మంత్రి పెద్దిరెడ్డి సహా మరికొందరు YCP నేతలు ఉన్నారని TDP, BJP ముఖ్యనేతలు ఆరోపించారు. అప్పుడు వారు చేసిన ఆరోపణలకు బలం చేకూర్చేలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఉండడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story