Rayalaseema: సీఎం సొంత జిల్లాలో వైసీపీ నాయకుల్లో అంతర్యుద్ధం.. రాయలసీమ మొత్తం ఇదే పరిస్థితి..

Rayalaseema: సీఎం సొంత జిల్లాలో వైసీపీ నాయకుల్లో అంతర్యుద్ధం.. రాయలసీమ మొత్తం ఇదే పరిస్థితి..
Rayalaseema:రాయలసీమ జిల్లాల్లో వైసీపీ రాజకీయం వేడెక్కిందా?ఫ్యాను రెక్కలకు నష్టం వస్తుండడం వెనుకున్న ఓపెన్ సీక్రెట్ ఏంటి?

Rayalaseema: రాయలసీమ జిల్లాల్లో వైసీపీ రాజకీయం వేడెక్కిందా? సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా? ఎంపీలు, ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పదవులు పొందిన నాయకుల మధ్య పొసగడం లేదా? నియోజకవర్గంపై పట్టుకోసం ఎవరికివారే ప్రయత్నిస్తుండడంతోనే పరిస్థితి చేయిజారిపోతోందా? నాయకుల మధ్య వర్గపోరు ఇటు పార్టీ క్యాడర్ కు అటు ప్రజలకు తలనొప్పిగా మారుతోందా? అనంతపురం లాంటి జిల్లాలో నేతల అవినీతిపై ఫోకస్ పెట్టిన అధిష్ఠానం.. నిఘా కోసం షాడో టీంలను రంగంలోకి దింపిందా? రాయలసీమ జిల్లాల్లోని ఫ్యాను రెక్కలకు నష్టం వస్తుండడం వెనుకున్న ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి?

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయనే టాక్ ఉంది. తంబ‌ళ్లప‌ల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వార‌కానాథ్‌రెడ్డిని ప్రశ్నిస్తే చాలు.. సొంత పార్టీ వారైనా లోప‌లేయిస్తున్నార‌ని వైసీపీ జెడ్పీటీసీ భ‌ర్త కొండ్రెడ్డి రోడ్డెక్కారు. నియోజ‌క‌వ‌ర్గం మొత్తం వైసీపీ నేత‌ల‌దీ ఇదే మాట‌. పెద్దిరెడ్డి బ‌స్సుల్లో ఓటర్లను త‌ర‌లించినా వారితో ఓట్లేయించేది మేమేనంటూ తొడ‌గొట్టడం చర్చనీయాంశమైంది.

వైసీపీ ప్రభుత్వంలో నెంబరు 2గా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి తంబళ్ళ పల్లెలో అస్మదీయుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు న‌గ‌రి ఎమ్మెల్యే రోజా పరిస్థితి మ‌రీ దారుణ‌ంగా తయారైందనే ప్రచారం జరుగుతోంది. త‌న‌కు పోటీగా ఎదుగుతున్నార‌ని వైసీపీ నేత‌ల్ని స‌స్పెండ్ చేయిస్తే, వారు పెద్దిరెడ్డి ఆశీస్సుల‌తో సొంతంగా కార్యక్రమాలు చేప‌డుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

దీనిపై రోజా ఏకంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది. కర్నూలు జిల్లా వైసీపీలో నాయకుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. మంత్రి అనీల్ ను.. కర్నూలు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా నియమించినప్పటి నుంచి పార్టీలో విబేధాలు మొదలయ్యాయనే ప్రచారం జరుగుతోంది. నంద్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మాజీమంత్రి శిల్పా మోహన్ రెడ్డిలపై కొందరు అసమ్మతి నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

శిల్పా ఫ్యామిలీపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు న్యాయవాది తులసిరెడ్డి. అటు బలిజ కాపు సామాజిక వర్గం నేతలు కూడా ఆగ్రహంతో ఉన్నట్లు టాక్. మరోవైపు నందికొట్కూర్ నియోజకవర్గం ఎస్సీ సెగ్మెంట్ అయినప్పటికీ ఇక్కడ షాప్ చైర్మన్, నందికొట్కూర్ సమన్వయ కర్త బైరెడ్డి సిద్దార్థ రెడ్డిదే హవా నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్యే ఆర్ధర్ వర్సెస్ షాప్ ఛైర్మన్ సిద్ధార్థ్ రెడ్డి అన్నట్లుగా పరిస్థితి మారిందట. మంత్రి అనిల్ సపోర్ట్ ఉండడంతోనే సిద్ధార్థరెడ్డికి ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. ఇక తన సొంత నియోజకవర్గం డోన్ లో ఇటీవల పర్యటించిన రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి రైతుల నుంచి చేదు అనుభవం ఎదురైంది.

ఇక పత్తికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెరుకులపాడు శ్రీదేవి, ఎంపీ గోరంట్ల మాధవ్ మధ్య విభేదాలు రచ్చకెక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీదేవి, వైసీపీ నేత మురళీధర్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయనే టాక్ వినిపిస్తోంది. జిల్లాలోని ఎంపీలు సంజీవ్ కుమార్, పోచా బ్రహ్మానంద రెడ్డిలకు, ఎమ్మెల్యేలకు పొసగడం లేదనే టాక్ వినిపిస్తోంది.

అందుకే ఎమ్మెల్యేలు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు ఎంపీలను దూరం పెడుతున్నట్లు సమాచారం. అటు కోడూమూరు వైసీపీలో ఎమ్మెల్యే సుధాకర్, కుడా ఛైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. చివరికి ఈ రెండు వర్గాల మధ్య వివాదం అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసుకునేదాకా వెళ్లింది. అటు అర్బన్ పాలిటిక్స్ విషయంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని టాక్ వినిపిస్తోంది.

మంత్రాలయం నియోజకవర్గానికి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అయితే.. ఆయన అన్న సీతారామిరెడ్డి కొడుకు ప్రదీప్ రెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడంటూ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. సీఎం జగన్ సొంత ఇలాకాలో అధికార పార్టీ నేతల మధ్య అంతర్యుద్ధం నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పదవుల పంపకాలతో మొదలైన గ్రూపు రాజకీయాలు తారా స్థాయికి చేరుకున్నాయనే టాక్ వినిపిస్తోంది.

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మూడు ముక్కలాట నడుస్తున్నట్లు పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి రమేష్ యాదవ్ కి మధ్య వర్గపోరు తారా స్థాయికి చేరినట్లు సమాచారం. అటు ఎంవీ రమణారెడ్డి కుటుంబానికి ఆప్కాబ్ ఛైర్మన్ పదవి వరించడంతో.. ఎమ్మెల్యేకు మరో తలనొప్పి మొదలైనట్లు టాక్. అనంత‌పురం జిల్లాలో వైసీపీ నేత‌లు మ‌ధ్య వైరం తీవ్రం అవుతోంది.

ఎంపీ రంగ‌య్య, క‌ళ్యాణ‌దుర్గం ఎమ్మెల్యే ఉష‌శ్రీచ‌ర‌ణ్ మ‌ధ్య గొడ‌వ‌లు ముదిరి పాకాన‌ప‌డ్డాయనే టాక్ వినిపిస్తోంది. క‌దిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ప‌ద‌వులు అమ్ముకున్నార‌ని వైసీపీ నేత‌లే ఆరోపించ‌డంతో వివాదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఉరవకొండ వైసీపీలో మూడు ముక్కలాట కొనసాగుతోందనే టాక్ వినిపిస్తోంది. ముగ్గురు నేతల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతున్నట్లు పార్టీ శ్రేణుల్లోనే చర్చ నడుస్తోంది.

వైసీపీలో త్రిమూర్తులుగా పేరున్న ఎమ్మెల్సీ శివరాంరెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇంఛార్జీ విశ్వేశ్వర్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్ రెడ్డిల మధ్య విభేదాలు భగ్గుమన్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు హిందూపురంలో నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఇక్బాల్, ఆగ్రో ఛైర్మన్ నవీన్ నిశ్చల్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్నట్లు సమాచారం.

రాయదుర్గంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనంతపురం జిల్లా అధికార పార్టీ వైసీపీ ప్రజాప్రతినిధుల పనితీరుపై అధిష్ఠానం నిఘా పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. జిల్లాలో రెండు పార్లమెంటు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటి పరిధిలోని పలువురు నాయకులపై రకరకాల ఆరోపణలు వస్తున్నాయి.

దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయానికి తూట్లు పొడుస్తున్నారని, అటు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా ప్రవర్తిస్తున్నారని వైసీపీ అధిష్టానం సీరియస్ అయింది. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి అధిష్టానం నేరుగా ఓ అంతరంగికుడిని నియమించినట్లు నేతలు చర్చించుకుంటున్నారు. జిల్లాలోని ఎనిమిది మంది ప్రజా ప్రతినిధులపై విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయని పార్టీ కార్యకర్తలే కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story