వైసీపీ ఎంపీల్లో ఎక్కువ మంది కొత్తవారు కావడంతో..

వైసీపీ ఎంపీల్లో ఎక్కువ మంది కొత్తవారు కావడంతో..

ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా పోరాడాలని ఎంపీలకు స్పష్టం చేశారు జగన్‌.. రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని సూచించారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై తనపార్టీ MPలకు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. సంఖ్యాబలం ఉన్నందున.. ప్రత్యేక హోదా సాధించే విషయంలో ఏ మాత్రం వెనక్కితగ్గొదన్నారు.

ప్రత్యేక హోదా సాధనే లక్ష్యమని మరోసారి సీఎం జగన్‌ స్పష్టం చేశారు. వైసీపీ మాత్రమే హోదా సాధించగలదే నమ్మకంతో ప్రజలకు 22 మంది ఎంపీలను ఇచ్చారని జగన్‌ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌లో సంఖ్యా బలం అధికంగా ఉండడంతో ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరు అడుగులు వేయాలని ఎంపీలకు పిలుపు ఇచ్చారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఎంపీలతో సమావేశమైన ఆయన.. పార్లమెంటు ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, కేంద్రం నుంచి నిధులు సాధించడంపై ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం చేశారు

ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు అడుగుతూనే ఉండాలని, దీనిపై ఏ మాత్రం వెనక్కితగ్గవద్దని జగన్ ఎంపీలకు సూచించారు. రాష్ట్ర సమస్యలను సామరస్యపూర్వకంగా కేంద్రం దృష్టికి ఎలా తీసుకెళ్లాలన్నదానిపై పార్టీ ఎంపీలకు వివరించారు. ఎంపీల్లో ఎక్కువ మంది కొత్తవారు కావడంతో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను సభలో ఏవిధంగా లేవనెత్తాలన్న అంశంపై సీఎం జగన్‌ సూచించారు.

పార్లమెంట్‌లో నాలుగవ అతిపెద్ద పార్టీగా వైసీపీ ఉందన్నారు జగన్. దీన్ని ఒక అవకాశంగా భావించాలని ఎంపీలకు స్పష్టం చేశారు. సంఖ్యాబలాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని ఫలితాలు రాబట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఎంపీల గౌరవం పెరిగేలా, హుందాగా వ్యవహరిస్తూ సభా కార్యక్రమాల్లో పాల్గొనాలని జగన్ గైడ్ చేశారు. నియోజకవర్గాల వారిగా సమస్యలపై గళం విప్పాలి అన్నారు. ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల అవసరాలు దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీలను ఎంపిక చేసుకోవాలన్నారు.

ఎంపీలను సబ్‌ గ్రూప్‌లుగా ఏర్పాటు చేసి, మంత్రిత్వ శాఖల వారీగా సబ్జెక్టులు కేటాయిస్తామన్నారు జగన్‌. తరచుగా ఆయా మంత్రిత్వ శాఖలతో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ అంశాలపై దృష్టి సారించాలన్నారు. పార్లమెంట్‌ పార్టీ నేతగా విజయసాయి రెడ్డి, లోక్‌సభ ఫ్లోర్‌ లీడర్‌ మిథున్‌ రెడ్డి సలహాలు, సూచనలతో సభా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఎంపీలకు జగన్‌ సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story