ఏపీ పరిషత్‌ ఎన్నికల్లో అధికార పక్షానిదే హవా ..!

ఏపీ పరిషత్‌ ఎన్నికల్లో అధికార పక్షానిదే హవా ..!
ఏపీలో పరిషత్‌ తీర్పు ఏకపక్షమైంది. అందరూ ఊహించినట్లే వార్‌ వన్‌సైడ్‌ అయ్యింది. అధికార పక్షానికే మెజార్టీ స్థానాలు దక్కాయి.

ఏపీలో పరిషత్‌ తీర్పు ఏకపక్షమైంది. అందరూ ఊహించినట్లే వార్‌ వన్‌సైడ్‌ అయ్యింది. అధికార పక్షానికే మెజార్టీ స్థానాలు దక్కాయి. అయితే వైసీపీ ప్రభుత్వం దౌర్జన్యాలతో ఓట్లు వేయించుకుందని టీడీపీ సహ విపక్ష పార్టీలన్నీ ఆరోపిస్తున్నాయి. విశాఖ, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలను అధికార పార్టీ వైసీపీ కైవసం చేసుకుంది. కొన్ని చోట్ల మాత్రం బ్యాలెట్‌ బాక్సులకు చెదలు పట్టడం, ఇటీవల కురిసిన వర్షాలకు తడిచిపోవడంతో బ్యాలెట్‌ పేపర్లు లెక్కలోకి రాలేదు. కుప్పంలో సైతం వైసీపీ పాగా వేసింది. అక్కడ టీడీపీ మూడు స్థానాల్లో విజయం సాధించింది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొన్ని చోట్ల కొనసాగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లో ఉదయం నుంచి కౌంటింగ్‌ నిర్వహించారు. భారీ పోలీసుల బందోబస్తు మధ్య కౌంటింగ్‌ ప్రక్రియ జరిగింది. 13 జిల్లా పరిషత్‌లలో 11 జెడ్పీలు అధికార పార్టీకే దక్కాయి. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇక చిత్తూరు జిల్లాలో 886 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ 822 సొంతం చేసుకోగా... టీడీపీ 25 స్థానాల్లో గెలుపొందింది. కృష్ణా జిల్లాలో 46 జెడ్పీటీసీ స్థానాల్లో 23 వైసీపీ గెలిచింది. ప్రకాశం జిల్లాలో 56 స్థానాల్లో 44 వైసీపీ గెలుపొందగా... పలు చోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. బల్లికురవ మండలం గుంటుపల్లిలో 149 ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలిచారు.

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ 484 ఎంపీటీసీలను గెలవగా... టీడీపీ 74, ఇతరులు 10 స్థానాల్లో గెలిపారు. విశాఖ జిల్లాలో వైసీపీ 486 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించగా... టీడీపీ 118, బీజేపీ 6, ఇతరులు 29 స్థానాల్లో విజయం సాధించింది. ఇక అనంతపురం జెడ్పీ స్థానాల విషయానికొస్తే... వైసీపీ 59 స్థానాలను కైవసం చేసుకోగా... టీడీపీ ఒక జెడ్పీటీసీ స్థానంలో గెలుపొందింది. అలాగే చిత్తూరు జిల్లాలో 63 జెడ్పీటీసీలను వైసీపీ దక్కించుకుంది. అయితే బంగారుపాలెం, కలకడలో అభ్యర్థులు మృతి చెందడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇక తూర్పుగోదావరి జిల్లాలో 329 ఎంపీటీసీ అభ్యర్ధులను వైసీపీ గెలుపించుకోగా... టీడీపీ 49, జనసేన 28 స్థానాల్లో గెలిచాయి.

ఏపీలో మొత్తం 10 వేల 47 ఎంపీటీసీ స్థానాలుండగా... నోటిఫికేషన్‌ టైంకి 375 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో మొత్తం 9 వేల 672 స్ధానాల్లో.. 2 వేల 371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అభ్యర్ధుల మృతితో 81 స్థానాల్లో పోలింగ్ నిలిచిపోయింది. 7 వేల 220 స్ధానాలకు ఎన్నికలు జరగగా.. 18 వేల 782 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. అలాగే జడ్‌పీటీసీ స్థానాలు 660 ఉండగా.. 8 చోట్ల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. 652 స్ధానాల్లో.. 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 515 స్ధానాలకు పోలింగ్ జరగగా.. 2 వేల 58 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.

ఈసారి పరిషత్‌ ఎన్నికలను టీడీపీ బహిష్కరించడంతో పోలింగ్‌ శాతం బాగా తగ్గిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే టీడీపీ మద్దతులో పలు ప్రాంతాల్లో అభ్యర్థులు పోటీ చేసి సత్తా చాటారు. ఇక ఈనెల 24 ఎంపీపీ, 25న జెడ్పీ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story