YS Jagan: విజయసాయిరెడ్డిని పక్కన పెట్టి వారికే ప్రాధాన్యత ఇస్తున్న జగన్..

YS Jagan: విజయసాయిరెడ్డిని పక్కన పెట్టి వారికే ప్రాధాన్యత ఇస్తున్న జగన్..
YS Jagan: జగన్‌, విజయసాయిరెడ్డి మధ్య దూరం రోజురోజుకీ పెరుగుతోందా?

YS Jagan: జగన్‌, విజయసాయిరెడ్డి మధ్య దూరం రోజురోజుకీ పెరుగుతోందా? జగన్‌ ఢిల్లీ పర్యటనతో ఇద్దరి మధ్య దూరం ఎంత పెరిగిందన్నది స్పష్టంగా తెలుస్తోంది. గత పర్యటనలకు భిన్నంగా జగన్‌ రెండు రోజుల ఢిల్లీ పర్యటన సాగింది. ఢిల్లీ టూర్‌లో విజయసాయిరెడ్డికి ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

అందరితో పాటే విజయసాయిరెడ్డిని కూడా చూశారు తప్ప.. కనీసం ఒక్కసారిగా కూడా విజయసాయితో ముఖాముఖి మాట్లాడలేదని చెబుతున్నారు. రాత్రి డిన్నర్‌కు కూడా విజయసాయిరెడ్డిని దూరం పెట్టారనేది టాక్. పైగా అన్నీ తానే చూసుకోవాల్సి వస్తోందని, కనీసం అపాయింట్‌మెంట్లు కూడా ఖరారు చేయించలేకపోతున్నారంటూ పరోకంగా విజయసాయిపై ఎంపీల ముందు అసహనం వ్యక్తం చేసినట్లు చెప్పుకుంటున్నారు.

విజయసాయిరెడ్డిని పక్కన పెట్టి.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు ఢిల్లీ వ్యవహారాలన్నీ విజయసాయి చూసుకునే వారు. అపాయింట్‌మెంట్ల నుంచి మీటింగ్‌ అయిపోయేంత వరకు విజయసాయిరెడ్డే అన్నీ తానై వ్యవహరించే వారు. కాని, ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి ఈ వ్యవహారాలు చూస్తున్నారు.

మొన్నటి ఢిల్లీ టూర్‌లో జ్యోతిరాధిత్య సింధియాతో జరిగిన మీటింగ్‌లోనూ విజయసాయిరెడ్డిని బయటకు పంపించిన తరువాతే జగన్ సమావేశం కొనసాగించారని చెబుతున్నారు. అంతేకాదు, రాష్ట్రంలోనూ విజయసాయిరెడ్డికి ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదు. ఒకప్పుడు విశాఖ అంటే విజయసాయిరెడ్డి అనే పేరుంది. ఉత్తరాంధ్రలో చీమ చిటుక్కుమన్నా విజయసాయిరెడ్డికి తెలియాల్సిందే.

విజయసాయిరెడ్డికి చెబితే పని జరగాల్సిందే. కాని, ఇప్పుడంత సీన్‌ లేదని రాజకీయ వర్గాల్లోనే వినిపిస్తోంది. కొద్దిరోజులుగా విజయసాయిరెడ్డి మాటలను ఏపీలోని పలు కీలక శాఖల అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదు. విజయసాయి రెడ్డికి సిఫార్సులను పెద్దగా పట్టించుకోవద్దని రాష్ట్రంలోని ఉన్నతాధికారులకు ప్రభుత్వ ముఖ్యులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారని మాట్లాడుకుంటున్నారు.

ఈ కారణంగానే విజయసాయిరెడ్డి సిఫార్సులను కీలక ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని వైసీసీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో విజయసాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గించి, సజ్జల రామకృష్ణారెడ్డికి ఇంపార్టెన్స్ పెంచారని వైసీపీలో చర్చ జరుగుతోంది. అందుకు తగ్గట్టే ఏ కార్యక్రమమైనా సజ్జలనే చూస్తున్నారు. ప్రెస్‌మీట్లు, జగన్‌ చెప్పాల్సిన మాటలు, ఉద్యోగ సంఘాలతో చర్చలు, మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహారాలు అన్నీ సజ్జలనే చూసుకుంటున్నారు.

దీంతో అటు ఢిల్లీలో, ఇటు రాష్ట్రంలో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గించారని మాట్లాడుకుటున్నారు. అసలు విజయసాయిరెడ్డిపై అంత ఆగ్రహం దేనికి? ఉన్నట్టుండి విజయసాయిని పక్కన పెట్టడానికి కారణం ఏంటి? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. విజయసాయి రెడ్డి దూకుడు, వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడంపై జగన్ ఆగ్రహంగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.

ఈమధ్య ఢిల్లీలో జరిగిన ఓ డిన్నర్‌లో.. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల పంపిణీ గురించి ఎంపీలతో విజయసాయి రెడ్డి మాట్లాడారని, ఆ మీటింగ్‌లో విజయసాయిరెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని జగన్ దృష్టికి వచ్చింది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో విజయసాయి రెడ్డి తరచు సమావేశం అవడంపైనా జగన్‌కు సమాచారం చేరవేస్తున్నారు కొందరు పార్టీ ముఖ్యులు.

విజయసాయి రెడ్డి రాజ్యసభ సీటు రెన్యువల్ పైనా వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈసారి విజయసాయిరెడ్డికి రాజ్యసభ సీటు రెన్యువల్‌ చేయకపోవచ్చని చెబుతున్నారు. ఈసారి విజయసాయిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, రాష్ట్రానికే పరిమితం చేస్తారని, జగన్‌ ఇప్పటికే ఈ విషయం విజయసాయిరెడ్డికి చెప్పారని తెలుస్తోంది. ఆ కారణంగానే కేంద్ర పెద్దలకు విజయసాయి రెడ్డి దగ్గరగా మెలుగుతున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పైగా కొద్దికాలంగా సోషల్ మీడియాలోనూ మోదీ, కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా విజయసాయిరెడ్డి ఎక్కువ పోస్టింగులు పెడుతున్నారని చెబుతున్నారు. బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయవాడలో ప్రజాగ్రహసభ పెట్టిన రోజే.. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్‌తో ఫోటో దిగడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కామెంట్లు పెట్టడం పెద్ద చర్చకు దారితీసింది. విజయసాయి రెడ్డి పోస్టుపై జాతీయ మీడియా, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

అయితే, తాను జగన్‌కు దూరం కాలేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు విజయసాయిరెడ్డి. ఈ నెల 3వ తేదీన ప్రధానిని జగన్ కలిశారు. ఆ రోజే ఇద్దరి సమావేశ ఫోటోను మీడియాకు విడుదల చేశారు విజయసాయిరెడ్డి. తాను కూడా జగన్‌తో ప్రధానిని కలిసినట్లు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీన్ని విజయసాయిరెడ్డి టీమ్ స్వయంగా జాతీయ మీడియాకు పంపించిందన్న వార్తలు వస్తున్నాయి. ఈ ఫొటోను ప్రత్యేకంగా విడుదల చేయడంపైనా జగన్‌ గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story