ముఖ్యమంత్రి హోదాలో ప్రజలనుద్దేశించి తొలి ప్రసంగం..

ముఖ్యమంత్రి హోదాలో ప్రజలనుద్దేశించి తొలి ప్రసంగం..

గురువారం మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, ప్రజలు భారీగా వస్తారని అంచనా వేస్తున్నారు.. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా 5 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు గవర్నర్ నరసింహన్ , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ ల కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల కోసం మరో మార్గాన్ని నిర్దేశించారు. సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసేందుకు వాహనాలను దారి మళ్లిస్తున్నారు.

స్టేడియంలో మొత్తం రెండు ప్రధాన స్టేజిలను ఏర్పాటు చేశారు. ఓ స్టేజిపై ప్రమాణ స్వీకార కార్యక్రమం, మరోదానిపై గవర్నర్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులు కూర్చుంటారు . జడ్జిలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. జగన్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రిగా గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం జగన్‌ ముఖ్యమంత్రి హోదాలో ప్రజల నుద్దేశించి తొలి ప్రసంగం చేస్తారు. ప్రజలకు ధన్యవాదాలు తెలపడంతోపాటు తాను అందించాలనుకుంటున్న సుపరిపాలన ఎలా ఉంటుందనే విషయాన్ని వివరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి.సుబ్రమణ్యం, డిజిపి ఆర్పీ ఠాకూర్‌, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు, జగన్ ప్రమాణస్వీకార ఘట్టానికి సంబంధించిన ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈకార్యక్రమానికి హాజరుకాలేని వాళ్లు కూడా వీక్షించేందుకు వీలుగా సిటీలో 14 చోట్ల భారీ LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వారికి 5 రకాల పాస్‌లు ఇప్పటికే జారీ చేశారు. ప్రజాప్రతినిధుల వాహనాల పార్కింగ్ కోసం ఏఆర్ మైదానాన్ని కేటాయించారు. అధికారులు, సిబ్బంది, సహాయకుల వాహనాల పార్కింగ్ కోసం బిషప్ అజరయ్య ఉన్నత పాఠశాల, స్టేట్ గెస్ట్‌హౌస్‌లను ఉపయోగిస్తారు. స్పాట్..

ఎండల తీవ్రత దృష్ట్యా వేదిక ప్రాంగణంలో తాగునీటి సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, లక్ష లస్సీ ప్యాకెట్లు, 3 లక్షల మంచినీటి పాకెట్లను సిద్ధం చేశారు.కార్యక్రమాన్ని వీక్షించే వారి కోసం పైభాగంలో 20 గ్యాలరీలు, కింది భాగంలో వేదిక వద్ద 15 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ప్రతి గ్యాలరీకి ఒక తహశీల్దారును ఇన్‌చార్జిగా నియమించారు.

రేపు విజయవాడలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు.. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు కృష్ణాజిల్లా హనుమాన్‌జంక్షన్‌, నూజివీడు, విస్సన్నపేట, ఖమ్మం జిల్లా వైరా, ఖమ్మం, సూర్యాపేట మీదుగా హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్లే వాహనాలు హైదరాబాద్‌, ఇబ్రహీంపట్నం, మైలవరం, నూజివీడు, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా విశాఖపట్టణం చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే.. హైదరాబాద్‌, కంచికచర్ల, జి.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా కూడా విశాఖపట్టణం చేరుకోవచ్చు. విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాలు గుంటూరు, తెనాలి, బాపట్ల, అవనిగడ్డ, చల్లపల్లి, పామర్రు, గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లే వాహనాలు నార్కట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, అడవినెక్కలం, మేదరమెట్ల, ఒంగోలు మీదుగా చెన్నై వెళ్లాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story