TDP Vs YCP: అధికార పార్టీ వాళ్లైతే మాత్రం ఎంతకైనా తెగించొచ్చా?

TDP Vs YCP: అధికార పార్టీ వాళ్లైతే మాత్రం ఎంతకైనా తెగించొచ్చా?
TDP Vs YCP: రాష్ట్రంలో జరుగుతున్న ఈ దారుణ పరిణామాలపై ప్రతిపక్షాలు గట్టిగా ప్రశ్నిస్తున్నాయి.

TDP vs YCP:అధికార పార్టీ వాళ్లైతే మాత్రం ఎంతకైనా తెగించొచ్చా? వైసీపీ అండదండలు ఉంటే చాలు.. దాడి చేసిన వారిపై బోటాబోటీ కేసులు, తీవ్రమైన కేసులలో సైతం స్టేషన్‌ బెయిల్స్. ప్రతిపక్షాలు ఒక్క మాట అంటే మాత్రం.. మరో ఆలోచన లేకుండా కేసులు, బెయిల్‌ తీసుకోడానికి వీల్లేనన్ని సెక్షన్లు. చివరికి ఎస్సీలపై ఎస్సీ, ఎస్టీ కేసులు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ దారుణ పరిణామాలపై ప్రతిపక్షాలు గట్టిగా ప్రశ్నిస్తున్నాయి.

సుబ్బారావు గుప్తాపై మంత్రి బాలినేని అనుచరుడు సుభానీ ఏ రేంజ్‌లో దాడి చేశాడో అందరూ చూశారు. దీనికి ప్రత్యక్ష సాక్షులు కూడా అక్కర్లేదు. చంపేస్తా అంటూ డైరెక్టుగా వార్నింగ్‌ ఇచ్చాడు. వీడియో తీయించి మరీ చితకబాదాడు. అయినా సరే అవేం తీవ్రమైన కేసులు కాదని పోలీసులు ఎలా చెబుతారని ప్రశ్నిస్తోంది టీడీపీ. ఇంతేనా, సుబ్బారావును కొట్టడానికంటే ముందు ఆయన ఇంటి మీదకు వెళ్లారు. ఇంటిపై రాళ్లు వేశారు, సామాన్లు విసిరేస్తూ నానా గలాటా సృష్టించారు.

ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం మరిచిపోయారు. పైగా మీ ఆయన్ను చంపేస్తాం అంటూ బెదిరింపులు.. ఇవన్నీ తీవ్రమైన నేరాలు కావని ఎలా అంటారని నిలదీస్తున్నారు. అంత తీవ్రంగా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తికి సాయంత్రం కల్లా స్టేషన్‌ బెయిల్‌ రావడమేంటని ప్రశ్నిస్తున్నారు. మరి, ఇదే నీతి టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఎందుకు వర్తించడం లేదనేదే ప్రతిపక్షాల ప్రశ్న.

ఒక్క మాట అనడం ఆలస్యం అబ్బో ఎన్ని కేసులు పెడతారో వారికే తెలియదంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మొన్నటికి మొన్న అనంతపురంలో టీడీపీ మహిళా నేతల ఇళ్లపై పోలీసులు దాడి చేయడాన్ని ఆ పార్టీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. మహిళా నేతలు ఏం చేశారని వారి ఇళ్లలో సోదాలు చేసి, కేసులు పెట్టారని ప్రశ్నిస్తున్నారు.

మొన్నటికి మొన్న గంటా సుబ్బారావుపైనా అదే తరహా కేసులు పెట్టారని గుర్తుచేస్తున్నారు. బెయిల్‌ కోసం హైకోర్టుకు వెళ్లాల్సినంత పరిస్థితి తెచ్చారు. చివరకు కోర్టే మందలించడంతో తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రతిపక్షాలపై లేనిపోని కేసులు పెట్టడం కొత్తేం కాదు. కాని, అదే విచక్షణను వైసీపీ వ్యక్తులపై ఎందుకు చూపించడం లేదని నిలదీస్తున్నారు.

ఆ మధ్య స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు మాచర్లలో వైసీపీ నేత ఏకంగా టీడీపీ నేతలు వెళ్తున్న కారుపైనే దాడికి దిగారు. దొడ్రు కర్రలతో వీరంగం సృష్టిస్తూ, భయభ్రాంతులకు గురిచేశాడు. అంత దారుణంగా ప్రవర్తిస్తే.. స్టేషన్‌ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించేశారని విమర్శిస్తోంది టీడీపీ.

మాస్క్‌ లేదని చితక్కొట్టడం, ప్రభుత్వంపై విమర్శలు చేశారంటూ హైదరాబాద్‌ వెళ్లి మరీ ఆడవారిని అరెస్ట్ చేయడం, తీవ్ర నేరం చేశారంటూ వారిపై పలు సెక్షన్లు జోడించి కేసులు పెట్టడం చేసిన వాళ్లు.. అధికార పార్టీ వ్యక్తుల విషయానికొచ్చే సరికి ఎందుకంత నీరుగారిపోతున్నారని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. నిన్న సుబ్బారావు గుప్తా విషయంలో ఏం జరిగిందో, ఏ మేరకు న్యాయం చేశారో, దాడి చేసిన సుభానీని రాత్రికి రాత్రే ఎలా విడుదల చేశారో.. ప్రతీదీ ప్రజలు గమనిస్తున్నారంటూ విమర్శలు ఎక్కుపెట్టాయి ప్రతిపక్షాలు.

Tags

Read MoreRead Less
Next Story