మెకానికల్ ఇంజనీర్.. యూట్యూబ్ చూసి పాత టైర్లు, డ్రమ్ములతో ఫర్నిచర్.. కోటి రూపాయల టర్నోవర్..

మెకానికల్ ఇంజనీర్.. యూట్యూబ్ చూసి పాత టైర్లు, డ్రమ్ములతో ఫర్నిచర్.. కోటి రూపాయల టర్నోవర్..
నెలకు రూ .12,000 ల జీతం. చాలీ చాలని సంపాదనతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది.

ఇంజనీర్ చదివి ఇవేం పనులురా అని అమ్మ తిడుతున్నా.. నువ్వుండమ్మా నీకేం తెలియదు అని వారిస్తూనే.. తన ప్రయత్నాన్ని ప్రారంభించాడు.. చేసే పనిపై శ్రద్ధపెట్టేవాడు.. ఆత్మవిశ్వాసంతో ముందడుగేశాడు. అతడి కష్టం వృధా పోలేదు.. మార్కెట్లో తన వస్తువులకు ఇప్పుడు మంచి గిరాకీ.

మహారాష్ట్రకు చెందిన ప్రమోద్.. చేస్తున్న సాప్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదలి P2S ఇంటర్నేషనల్‌ అనే స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. ఈ కంపెనీ ప్రధాన ఉద్దేశ్యం వేస్ట్ నుంచి బెస్ట్ తీసుకురావడం.. పనికి రావని పడేసిన టైర్లు, డ్రమ్ములే అతడి ఆయుధాలు. వాటిని ఆకర్షణీయమైన ఫర్నిచర్‌గా మార్చి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేయడం.

ప్రమోద్ 2015 లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, పూణేలోని ఒక బహుళజాతి కంపెనీలో మెయింటెనెన్స్ ఇంజనీర్‌గా పనిచేయడం ప్రారంభించాడు. నెలకు రూ .12,000 ల జీతం. చాలీ చాలని సంపాదనతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. ఇక డబ్బు ఆదా చేయడానికి ఆస్కారం లేదు. అనుకోని ఖర్చులొస్తే ఇచ్చే వాళ్లు కూడా లేరు. అయితే అనుకోకుండా ఓ రోజు చైనాకు వ్యాపార పర్యటన నిమిత్తం వెళ్లాల్సి వచ్చింది. తాను చేస్తున్న కంపెనీ యాజమాన్యం అతడిని అక్కడికి పంపించింది. అదే అతడి జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. చైనా సందర్శన సమయంలో చాలా విషయాలు నేర్చుకున్నాడు. పనికి రావని పడేస్తున్న పాత డ్రమ్ములు, టైర్లు వంటి వాటినిఉపయోగించి ఆకర్షణీయమైన ఫర్నిచర్‌గా తయారు చేసే కొన్ని వ్యాపారాలను అతను చూశాడు.



ఇది భారతదేశంలో కూడా వర్కవుట్ అవుతుందని భావించాడు. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, దాని గురించి పరిశోధన చేయడం మొదలుపెట్టాడు. ఇంతకు ముందు ఇలాంటివి ఎవరైనా తయారు చేస్తున్నారా లేదా అని తెలుసుకున్నాడు.. కానీ ఎక్కడా కూడా అలాంటి మార్కెట్ కనిపించలేదు. దాంతో తానే ఈ రంగంలో మొదటి అడుగు వేస్తున్నాడని తెలిసి ఒకింత భయం.. మరికొంత తనమీద తనకు నమ్మకం. వెరసి ఓ కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేశాడు.

నేడు ప్రమోద్ స్టార్టప్ - P2S ఇంటర్నేషనల్.. అతడికి లక్షలు సంపాదించి పెడుతుంది. తన వెంచర్‌పై పరిశోధన చేయడానికి, ఆధునిక పరిజ్ఞానాన్ని జోడించడానికి, డ్రమ్స్ మరియు టైర్‌లను ఫర్నిచర్‌గా ఎలా మార్చవచ్చు.. వాటిని మార్కెట్ ఎలా చేయాలి తదితర విషయాలను తెలుసుకోవడానికి తాను యూట్యూబ్‌లో గంటలు గంటలు గడిపానని ప్రమోద్ చెబుతాడు.

తన వ్యాపార ఆలోచనపై నమ్మకంతో, ప్రమోద్ రీసైకిల్ చేసిన టైర్ల నుండి కుర్చీలు, టేబుల్స్, సీటింగ్ వస్తువులను తయారు చేయడానికి కొన్ని వేల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. " సెప్టెంబర్ 2018 లో వ్యాపారాన్ని ప్రారంభించాడు. మొదట్లో తన వస్తువులను కస్టమర్‌లు గుర్తించలేదు. దాంతో కొంత నిరుత్సాహం. కానీ నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను.. ఏ వ్యాపారమైన ముందు ఇలానే ఉంటుంది. దాని గురించి నలుగురికీ తెలిస్తేనే వ్యాపారం పుంజుకుంటుంది అని మార్కెట్ వ్యాపార సూత్రాన్ని తెలుసుకున్నాడు.

తన ఉత్పత్తులు వినియోగదారులను ఆకర్షించేలా చేయడానికి, అతను వాటిని రోడ్ సైడ్ చెరకు రసం బండ్లు, ఫుడ్ కోర్టులలో ప్రదర్శించాడు. "2019 జనవరిలో, పుణేకి చెందిన కేఫ్ నుండి మొదటి ఆర్డర్ అందుకున్నాడు. అప్పుడు అతడికి రూ .50 వేలు ఆదాయం వచ్చింది. దాంతో చిన్నగా ఓ షోరూం ఏర్పాటు చేసుకున్నాడు.. అదృష్టవశాత్తూ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు రావడంతో తన ఉత్పత్తిని ప్రశంసించారని ఆనందంగా చెబుతాడు ప్రమోద్. తన వస్తువులకు మార్కెట్ బావుండడంతో 2019 లో, థానేలో మరో ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేశాడు. అక్కడ నుంచి మరో రూ. 5.5 లక్షల ఆర్డర్ వచ్చింది.

ఈ ఆర్డర్ తన కెరీర్‌లో ఒక మలుపు అని అంటాడు ప్రమోద్. ఉద్యోగం ద్వారా సంవత్సర ఆదాయం రూ. 2.5 లక్షలు వచ్చేది. వ్యాపారంపై పూర్తిగా దృష్టి పెట్టడానికి ఆ సంవత్సరం ప్రాజెక్ట్ పూర్తి చేసిన వెంటనే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు.



అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. వ్యాపారం విపరీతంగా పెరిగింది. వార్షిక ఆదాయం రూ .1 కోటి టర్నోవర్‌ని చేరుకుంది. 14 మంది వర్కర్లకు పని కల్పించే అవకాశం నాకు దొరికింది అని తన వ్యాపార విజయానికి కారణమైన వారిని కూడా చూపిస్తాడు ప్రమోద్. ఇప్పుడు తన వ్యాపారం విస్తరించి హర్యానా, పంజాబ్, బెంగళూరు, గోవా, చెన్నైతదితర రాష్ట్రాలనుంచి కూడా ఆర్డర్లు అందుకుంటున్నాడు.

COVID-19 లాక్డౌన్ సమయంలో కూడా వ్యాపారం వృద్ధి చెందుతూనే ఉందని ఆయన చెప్పారు. ఆ సమయంలో హాస్పిటల్ బెడ్‌లను కూడా తయారు చేశాడు. ఉపయోగించిన పదార్థాల నుండి వస్తువులను తయారు చేసినప్పుడు మంచి నాణ్యమైన ముడిసరుకును కొనుగోలు చేయడం కీలకం అవుతుందని ప్రమోద్ చెప్పారు. అరిగిపోయిన టైర్లను మాత్రమే ఉపయోగించాలి. పాడైన వాటిని ఉపయోగించకూడదు. ఆయిల్ పరిశ్రమల నుండి వచ్చిన డ్రమ్స్‌తో ఫర్నిచర్ తయారు చేస్తుంటే ఒకసారి డ్రమ్‌లో మంటలు చెలరేగిన సంఘటన గుర్తు చేసుకున్నారు. అందుకే డ్రమ్ములు, టైర్లు ఎంపిక చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలని చెబుతారు.

సవాళ్లను ఎదుర్కొంటేనే జీవితంలో ముందుకు వెళ్లగలం అని ఆయన తన సక్సెస్ మంత్రను చెబుతారు. "ప్రస్తుతం, చాలా మంది కస్టమర్లు నా ఉత్పత్తులను కోరుతున్నారు. కానీ నా వర్క్‌షాప్ నుండి నేను వారికి నా ఉత్పత్తులనుఅందించలేకపోతున్నాను. కాబట్టి, ఉన్న డిమాండ్‌ దృష్ట్యా సంబంధిత ప్రదేశాలలో ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నాను "అని ఆయన చెప్పారు.

2022 నాటికి ముంబై మరియు థానేలలో అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయాలని తాను ప్లాన్ చేస్తున్నట్లు ప్రమోద్ చెప్పారు. నేటి యువతను వ్యాపారులుగా మారమని విజ్ఞప్తి చేస్తున్నాడు. ఒక వ్యాపారవేత్తగా మారడం నిజంగా సంతృప్తికరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను" అని ప్రమోద్ మెరిసే కళ్లతో చెబుతున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story