Fuel price: పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ని తగ్గించిన 22 రాష్ట్రాలు..

Fuel price: పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ని తగ్గించిన 22 రాష్ట్రాలు..
Fuel price: దీంతో ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రేట్లు భారీగా తగ్గాయి.

Fuel price: పెట్రోలు, డీజిల్‌ పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో... తామూ సిద్ధమంటూ పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లీటరుపై 7 రూపాయల వ్యాట్ తగ్గించుకున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రేట్లు భారీగా తగ్గాయి. పెట్రోలు, డీజిల్‌ పై ఇప్పటి వరకు 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వ్యాట్ తగ్గించుకున్నాయి. ఇంకా 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగ్గింపునకు ముందుకు రాలేదు.

తెలంగాణ, ఏపీ సహా మరికొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గింపు గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ రాష్ట్రాల్లో రేట్లు అధికంగా ఉన్నాయి. రేట్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో రాజస్థాన్‌ మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రెండోస్థానంలో నిలవగా.. తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో రేట్ల విషయంలో ఏపీనే టాప్ లో ఉంది. చాలా రాష్ట్రాల్లో లీటరు డీజిల్‌ ధర 90 రూపాయల కిందకు చేరగా.. పెట్రోలు 100 నుంచి 102 రూపాయల్లోపే ఉంది.

పెట్రోలు, డీజిల్‌ బేసిక్ ధరపై కేంద్రం విధించే ఎక్సైజ్‌ డ్యూటీ కలపగా వచ్చే మొత్తంపై రాష్ట్రాలు వ్యాట్‌ వసూలు చేస్తాయి. తెలంగాణలో పెట్రోలుపై 35.20శాతం, డీజిల్‌పై 27శాతం చొప్పున వ్యాట్‌ విధిస్తున్నారు. పెట్రో ఉత్పత్తులపై పన్నుల ద్వారా తెలంగాణకు గతేడాది 8వేల 691 కోట్ల రాబడి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలుపై 31శాతం వ్యాట్‌, లీటరుకు 4 రూపాయల అదనపు వ్యాట్‌తోపాటు మరో రూపాయి రోడ్డు అభివృద్ధి సెస్‌ అని వసూలు చేస్తున్నారు.

డీజిల్‌పై కూడా 22.25శాతం వ్యాట్‌, లీటరుకు 4 రూపాయల అదనపుపు వ్యాట్‌ తో పాటు మరో రూపాయి రోడ్డు అభివృద్ధి సెస్ విధిస్తున్నారు. పన్నుల రూపంలో ఏపీకి గతేడాది 11వేల కోట్ల రాబడి వచ్చింది. పెట్రో ఉత్పత్తులపై తెలుగు రాష్ట్రాల కంటే తక్కువ ఆదాయం వస్తున్న రాష్ట్రాలు కూడా వ్యాట్ ను తగ్గిస్తున్నట్లు ప్రకటించినా.. మన ముఖ్యమంత్రుల నుంచి స్పందన రాకపోవడంపై విమర్శలొస్తున్నాయి.

పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలంటూ తెలుగు రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతోంది. కేంద్రం తగ్గించింది, మీరెందుకు తగ్గించరంటూ సీఎం కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు బీజేపీ లీడర్లు. రేట్లు తగ్గించి వినియోగదారులకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్. ఏపీలోనూ సీఎం జగన్ పై ఒత్తిడి పెరిగింది.

ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది బీజేపీ. జిల్లా, పార్లమెంటు కేంద్రాల్లో 12 గంటల నుంచి ఒంటి గంటవరకు నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story