LIC: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ సరికొత్త రికార్డ్..

LIC: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ సరికొత్త రికార్డ్..
LIC: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎల్ఐసీ.. తొలి పబ్లిక్‌ ఆఫర్‌ ఐపీఓ దరఖాస్తు గడువు ముగిసింది.

LIC: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎల్ఐసీ.. తొలి పబ్లిక్‌ ఆఫర్‌ ఐపీఓ దరఖాస్తు గడువు ముగిసింది. చివరి రోజైన సోమవారంతో అన్ని విభాగాల్లో ఎల్ఐసీ ఐపీఓకు మదుపర్ల నుంచి భారీ స్పందన వచ్చింది. జారీ చేసిన షేర్లకు మూడు రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. 16.20 కోట్ల షేర్లను పబ్లిక్‌ ఇష్యూకు కేటాయించగా.. మొత్తం 2.95 రెట్లు స్పందన లభించింది. 16.20 కోట్ల షేర్లకు గానూ 47.83 కోట్ల బిడ్లు దాఖలైనట్లు ఎక్స్ఛేంజీలు తెలిపాయి.

అత్యధికంగా పాలసీ హోల్డర్ల కేటగిరీలో 6.11 రెట్ల బిడ్లు దాఖలవ్వగా.. కనిష్ఠంగా రిటైల్‌ కోటాలో 1.99 రెట్ల దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది. అర్హులైన సంస్థాగత మదుపర్ల క్యూఐబీ విభాగంలో 2.83 రెట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. సంస్థాగతేతర మదుపర్ల ఎన్ఐఐ విభాగంలో 2.91 రెట్లు బిడ్లు వచ్చాయి. రిటైల్‌ విభాగంలో 1.99, ఉద్యోగుల కోటాలో 4.40, పాలసీ హోల్డర్ల కోటాలో 6.12 రెట్లు చొప్పున బిడ్లు దాఖలయ్యాయి.

ఐపీఓ ప్రారంభమైన తొలి రోజు నుంచి క్యూఐబీ కోటాకు స్పందన అంతంత మాత్రమే. ఐదో రోజు వరకు ఈ కోటాకు పూర్తి స్పందన లభించలేదు. అయితే చివరి రోజు పూర్తయ్యేసరికి ఏకంగా ఈ కోటాలో 2.83 రెట్ల దరఖాస్తులు రావడంపై ఎక్స్ఛేంజీలు హర్షం వ్యక్తం చేసాయి. ఇక ఎన్‌ఐఐ కోటాకు సైతం తొలి మూడు రోజులు దరఖాస్తులు నామమాత్రంగానే వచ్చాయని తెలిపింది. చివరి రోజు వచ్చేసరికి ఈ కోటాకు సైతం 2.91 రెట్లు బిడ్లు దాఖలయ్యాయని ప్రకటించింది.

మే 16న విజయవంతమైన బిడ్డర్ల ఖాతాలోకి షేర్లు బదిలీ అవుతాయని.. 17న ఎల్‌ఐసీ షేర్లు స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అవుతాయని వెల్లడించింది. ఎల్‌ఐసీ, ఐపీఓ సబ్​స్క్రిప్షన్ వివరాలను పరిశీలిస్తే.. ఐపీఓ ప్రారంభ తేదీ మే 4 కాగా.. మే 9న గడువు ముగిసింది. అలాగే ధరల శ్రేణి 902 నుంచి 949 రూపాయలుగా నిర్ణయించారు. ఇక ఐపీఓ విలువ 21 వేల 8 కోట్లు ఉంది. క్యూఐబీ కోటాకు కేటాయించిన షేర్లు 3 కోట్ల 95 లక్షల 31 వేల 236 ఉండగా.. ఎన్‌ఐఐ కోటా 2 కోట్ల 96 లక్షల 48 వేల 427 ఉంది. అలాగే రిటైల్‌ కోటా 6 కోట్ల 91 లక్షల 79 వేల 663, ఉద్యోగుల కోటా 15 లక్షల 81 వేల 249, పాలసీ హోల్డర్ల కోటా 2 కోట్ల 21 లక్షల 37 వేల 492 ఉంది.

Tags

Read MoreRead Less
Next Story