Bheemla Nayak Movie Review: భీమ్లానాయక్ ఎక్కడా తగ్గలేదుగా.. పవన్ నటన నెక్ట్స్ లెవెల్.. మూవీ రివ్యూ

Bheemla Nayak Movie Review:  భీమ్లానాయక్ ఎక్కడా తగ్గలేదుగా.. పవన్ నటన నెక్ట్స్ లెవెల్.. మూవీ రివ్యూ
Bheemla Nayak Movie Review: పవన్ కళ్యాణ్ నుంచి ఓ సినిమా వస్తోందంటే ప్రేక్షకులతో పాటు పరిశ్రమలోనూ ఓ సందడి కనిపిస్తుంది.

రివ్యూ : భీమ్లా నాయక్

తారాగణం : పవన్ కళ్యాణ్, రానా, నిత్య మీనన్, మురళీశర్మ, సంయుక్త మీనన్, రావు రమేష్ తదితరులు ..

ఎడిటర్ : నవీన్ నూలి

సంగీతం : తమన్ ఎస్

కెమెరా : రవి కె చంద్రన్

డైలాగ్స్ : త్రివిక్రమ్

నిర్మాత : సూర్యదేవర నాగవంశీ

దర్శకత్వం : సాగర్ కె చంద్ర

పవన్ కళ్యాణ్ నుంచి ఓ సినిమా వస్తోందంటే ప్రేక్షకులతో పాటు పరిశ్రమలోనూ ఓ సందడి కనిపిస్తుంది. అలాంటిది రిలీజ్‌కు ముందే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనిపించుకున్న భీమ్లా నాయక్ లాంటి మూవీ వస్తోందంటే ఇంక చెప్పేదేముందీ. ఎంటైర్ ఇండస్ట్రీ ఈ మూవీ రిజల్ట్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తోంది. అటు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్సెస్ కూడా అలాగే చూశారు. మరి ఇవాళ విడుదలైన భీమ్లా నాయక్ ఎలా ఉంది అనేది చూద్దాం.

కథ :

అటవీ ప్రాంతంలోని ఓ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తుంటాడు భీమ్లా నాయక్. నిజాయితీ పరుడైన పోలీస్ గా డిపార్ట్ మెంట్ లో పేరుంటుంది. ఓ రోజు రాత్రి డ్యూటీలో ఉండగా.. నాన్ లిక్కర్ జోన్ అక్కడికి డేనియల్ శేఖర్ బాగా తాగడమే కాక.. తన కార్ లో చాలా లిక్కర్ బాటిల్స్ కూడా తెస్తుంటాడు. ఇదేంటని ప్రశ్నించిన పోలీస్ లపై దాడి చేస్తాడు. భీమ్లా నాయక్ అతన్ని కొట్టి అరెస్ట్ చేస్తాడు. ఈ క్రమంలో శేఖర్ చేసిన అతికి కోప్పడి మరికొన్ని సెక్షన్స్ యాడ్ చేసి ఎఫ్ఐఆర్ రాస్తాడు. కానీ అతని ఫోన్ ను చూసిన తర్వాత అతనెవరో బిగ్ షాట్ అనిపించి పై ఆఫీసర్స్ కు ఫోన్ చేస్తాడు. దీంతో వాళ్లు అతన్ని బాగా చూసుకోమని చెబుతారు. అలా చూస్తోన్న క్రమంలో భీమ్లా నాయక్ నే ఆ కేస్ లో తెలివిగా ఇరికిస్తాడు శేఖర్. మరి అదేంటీ.. భీమ్లా నాయక్ ఆ కేస్ నుంచి తప్పించుకున్నాడా.. డేనియల్ అహంకారానికి, నాయక్ ఆత్మాభిమానానికి మధ్య జరిగే పోరాటలో ఎవరు విజయం సాధించారు అనేది అత్యంత ఆసక్తిగా సాగే కథ.

విశ్లేషణ :

మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ కు రీమేక్ గా వచ్చిన చిత్రం భీమ్లా నాయక్. బట్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులు చేశారు. కానీ అవేవీ కథలోని సోల్ ను ఇబ్బంది పెట్టలేదు. పైగా ఆ పాత్రలోకి పవన్ పరకాయ ప్రవేశం చేశాడు. అచ్చంగా భీమ్లా నాయక్ లానే ప్రవర్తించాడు. తగ్గాల్సిన చోట తగ్గుతూ.. నెగ్గాల్సిన చోట డబుల్ పవర్ తో దూసుకుపోతూ ఎవర్నీ లెక్క చేయని మొండివాడుగా అద్భుతమైన నటన చూపించాడు. ఈ మధ్యకాలంలో పవన్ నుంచి ఇంత పవర్ ఫుల్ నటన రాలేదు. నిజానికి గబ్బర్ సింగ్ తో పోల్చారు కానీ.. దానికి మించి కనిపిస్తుందీ చిత్రం.

ఓ చిన్న ఈగో క్లాష్ వల్ల ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో రాసుకున్న ఈ కథ ఓ రకంగా పవన్ ఇమేజ్ కూ సరిగ్గా సరిపోతుంది. పవర్ ఉందని ప్రతిదాన్నీ సులువుగా తీసుకునే వ్యక్తికీ.. తప్పు చేస్తే ఎంతటివాడినైనా ఎదిరించే నిజాయితీ ఉన్న వ్యక్తికీ మధ్య జరిగే కథనం ఆద్యంతం ఆసక్తిగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఏపి, తెలంగాణ బోర్డర్ లో ఉన్న లిక్కర్ ఇష్యూ కూడా కథకు బాగా సరిపోయింది. అటు శ్రీశైలం అటవీ ప్రాంతం నేపథ్యంగా కనిపించడం.. కథానాయకుడు గిరిజనుడు కావడం.. ఇవన్నీ తెలియకుండానే కథకు ఓ అందాన్ని తీసుకువచ్చాయి.

ఫస్ట్ హాఫ్ లో రానా డామినేటింగ్ గా కనిపించినా.. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి భీమ్లా పాత్ర బోన్ నుంచి బయటకు వచ్చిన సింహంలా మారుతుంది. అతన్ని ఆపడం ఎవరి తరం కాదని ఇతర పాత్రల ద్వారా, కొన్ని సన్నివేశాల ద్వారా కన్వే చేసిన విధానం.. తెలుగులోకి మార్చిన విధానం అద్భుతంగా కుదిరింది. దీంతో ఒరిజినల్ వెర్షన్ చూసిన వారికి సైతం ఈ చిత్రం నచ్చుతుంది. కాకపోతే పవన్ సరసన నటించిన నిత్య మీనన్, రానా సరసన నటించిన సంయుక్త మీనన్ పాత్రలను పూర్తిగా మార్చారు. ఆ మార్పు వల్ల క్లైమాక్స్ పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఈ సీన్ లో త్రివిక్రమ్ రాసిన ఒక్క డైలాగ్ పవన్ క్యారెక్టరైజేషన్ ను నెక్ట్స్ లెవెల్లో చూపిస్తుంది.

పవన్ కళ్యాణ్ తర్వాత రానా ఆ క్యారెక్టర్ లో జీవించాడు. అతని వాయిస్ కూడా బాగా ప్లస్ అయింది ఈ చిత్రానికి. ఇక రెబల్ లేడీగా నిత్య మీనన్ ఆకట్టుకుంటే.. సంయుక్త సైతం ఆ పాత్రలో మెప్పించింది. లోకల్ ఆకు రౌడీలాంటి పాత్రలో రావు రమేష్ ఉన్నంత సేపూ తనకే సొంతమైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. సముద్రకని పాత్ర పెద్దగా స్కోప్ లేకున్నా.. ఆ పాత్ర హుందాతనాన్ని నిలబెట్టాడాయన. సిఐగా మురళీశర్మ, డ్రైవర్ గా రఘుబాబుకు ఇవి రెగ్యులర్ రోల్స్. బాగా చేశారు.

దర్శకుడుగా సాగర్ చంద్ర తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. త్రివిక్రమ్ మాటలు కథను దాటి కాకుండా కథతో పాటు పాత్రల పరంగా బావున్నాయి. సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్. తమన్ నేపథ్య సంగీతం ఎప్పట్లానే అదరగొట్టాడు. పాటలూ బావున్నాయి. అయితే ఫస్ట్ హాఫ్ లో రెండు పాటల చిత్రీకరణ కాస్త నిరాశపరుస్తుంది. అలాగే అంత ఇష్టమేందయ్యా అనే చిత్ర పాడిన పాటను సినిమాలో నుంచి తీసేశారు. సితార బ్యానర్ నుంచి ఓ సినిమా వస్తోందంటే అంచనాలుంటాయి. వాటిని బ్లాక్ బస్టర్ తో మరోసారి నిలబెట్టుకుందీ బ్యానర్.

- బాబురావు. కామళ్ల

Tags

Read MoreRead Less
Next Story