Nagababu: మీరంటున్న పెద్ద హీరోలెవరూ పారితోషికం విషయంలో బెట్టు చేయరు - నాగబాబు

Nagababu (tv5news.in)

Nagababu (tv5news.in)

Nagababu: తెలుగు సినీ పరిశ్రమ విషయంలో వైసీపీ సర్కారు అవలంభిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు.

Nagababu: తెలుగు సినీ పరిశ్రమ విషయంలో వైసీపీ సర్కారు అవలంభిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు.. సీనియర్‌ నటుడు, నిర్మాత నాగబాబు. వైసీపీ ప్రభుత్వానికి, మంత్రులకు సినిమా ఆపరేషన్స్ గురించి ఏమీ తెలియదన్నారు. సినిమా బడ్జెట్‌లో హీరోల రెమ్యునరేషనే పది శాతానికి పైగా ఉంటుందని.. దీన్ని ఖర్చు కాదని అనే వాళ్లవి కేవలం అజ్ఞానపు మాటలే అని మండిపడ్డారు.

అయితే హీరోలెవరూ రెమ్యునరేషన్ల విషయంలో పంతం బట్టి కూర్చోరని.. సినిమాకు నష్టాలు వచ్చినప్పుడు.. అంతా తమ పారితోషికం తగ్గించుకున్నవారే అని చెప్పారు. తెలుగు సినిమాకి ఆంధ్రనే పెద్ద మార్కెట్‌ అన్న నాగబాబు… వైసీపీ సర్కారు వైఖరి వల్ల ఇండస్ట్రీ 50 శాతం వరకు నష్టపోతోందన్నారు. ఆంధ్రలో ఎవరు ఏ వ్యాపారం చేసినా అది వారే తీసేసుకుంటున్నారని.. మంత్రులు వెల్లంపల్లి, కొడాలి నాని వంటి వారిని హీరోలుగా పెట్టి సినిమాలు కూడా తీసుకోవాలంటూ నాగబాబు సెటైర్‌ వేశారు.

వైసీపీ నాయకుల తీరు పైనా నాగబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలంతా ఒక భ్రమలో బతుకుతున్నారని… వారంతా కేవలం ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉండే ప్రజాప్రతినిధులని నాగబాబు అన్నారు. అంబేద్కర్ ఐదేళ్లకోసారి ఎలక్షన్స్ పెట్టమన్నది వైసీపీ వాళ్ల కోసమే అని ఎద్దేవా చేశారు. వారు ఎవరిని సంతోషంగా ఉండనిస్తున్నారో చెప్పాలన్నారు. రానున్న రెండేళ్లలో అయినా పగలు, ప్రతీకారాలు వదిలి… ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని నాగబాబు హితవు పలికారు.

సినీ రంగ సమస్యల పరిష్కారం కోసం చిరంజీవి వచ్చి విజ్ఞప్తి చేసినా ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని నాగబాబు ప్రశ్నించారు. చిరంజీవి చాలా పెద్ద మనిషి అని.. ఆయనకు తమకు విబేధాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చిరంజీవి మంచిగా మాట్లాడినప్పుడు వైసీపీ సర్కారు కూడా మంచి చేసుంటే ఇప్పుడు ఇలా మాట్లాడాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు.

మీతో విబేధించాడని పవన్ కళ్యాణ్ ని టార్గెట్‌ చేస్తారా అంటూ మండిపడ్డారు. ఇదేమైనా నియంతృత్వం అనుకుంటున్నారా… వైసీపీయే శాశ్వతంగా అధికారంలో ఉంటుందని భావిస్తున్నారా అంటూ నాగబాబు ప్రశ్నించారు. సినీ పరిశ్రమ ప్రతినిధులుగా తాము అంశాల వారిగా స్పందిస్తామన్న నాగబాబు.. తెలంగాణ సర్కారు మీద ఎన్నోసార్లు విమర్శలు చేసినా.. వారెప్పుడూ ఇలా కక్షపూరిత ధోరణి అవలంభించలేదన్నారు.

కరోనా సమయంలోనూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నో విధాల సాయం చేసినా.. ఏపీ సర్కారు మాత్రం స్పందించలేదన్నారు. ప్రభుత్వాల మీద ఆధారపడకుండా… కొత్త విధానంలో ఆదాయం ఆర్జించడానికి ప్రయత్నిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఇండస్ట్రీ వారు ఆశ కొంచెం తగ్గించుకుని.. ఐకమత్యంతో ఉండాలని.. అలాగే థియేటర్‌ యజమానులు కూడా అన్ని అనుమతులు తీసుకుని ఉండాలని నాగబాబు సూచించారు

Tags

Read MoreRead Less
Next Story