Ram Gopal varma : 'ఉత్తరాది స్టార్స్‌ అంటే అసూయ'... సుదీప్‌కు మద్దతుగా వర్మ

Ram Gopal varma :  ఉత్తరాది స్టార్స్‌ అంటే అసూయ... సుదీప్‌కు మద్దతుగా వర్మ
Ram Gopal varma : దక్షిణాది సినిమాలంటే ఉత్తరాది వారికి ఎప్పుడూ చిన్నచూపే ఇది కాదనలేని వాస్తవం.

Ram Gopal varma : దక్షిణాది సినిమాలంటే ఉత్తరాది వారికి ఎప్పుడూ చిన్నచూపే ఇది కాదనలేని వాస్తవం. దశాబ్దాలుగా సినీరంగంలో ఈ రెండు ప్రాంతాల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ఇటీవల ఓ ఆడియో ఫంక్షన్‌ లో కన్నడ హీరో కిచ్చా సుదీప్‌ చేసిన వ్యాఖ్యలతో వివాదం చెలరేగింది. ప్యాన్‌ ఇండియా సినిమాల అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. కన్నడ సినీ పరిశ్రమ ప్యాన్‌ ఇండియా చిత్రాలు చేయడం కాదు.. ప్రపంచ స్థాయికి ఎదిగిందని చెబుతూ... అసలు ఇప్పుడు హిందీ జాతీయ భాష కాదన్నారు. హిందీవారే ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయి చిత్రాలు రూపొందిస్తున్నారంటూ చెప్పారు. తమ సినిమాలను దక్షిణాది భాషల్లోకి విడుదల చేసుకుంటున్నా విజయం అందుకోలేకపోతున్నారంటూ సుదీప్‌ వ్యాఖ్యలు చేశారు.

అయితే దీనికి బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సోదరా మీ ఉద్దేశం ప్రకారం హిందీ జాతీయ భాష కానప్పుడు మీరు మీ చిత్రాలను హిందీలో ఎందుకు డబ్‌ చేస్తున్నారని ప్రశ్నించారు. జాతీయ భాషగా హిందీ ఎప్పటి నుంచో ఉంది.. ప్రస్తుతమూ ఉంది.. ఎప్పటికీ ఉంటుంది అంటూ హిందీలో ట్వీట్‌ చేశారు. దీంతో ఈ వివాదం సినిమాల మీద నుంచి భాష మీదకు మళ్లింది. ఈ ట్వీట్‌కు సమాధానమిచ్చిన సుదీప్‌.. అజయ్‌ సర్‌.. విషయం మీకు మరో రకంగా అర్థమైందనుకుంటా.. నేను ఎవరినీ కించపరచలేదు.. మన దేశ భాషలన్నింటి మీదా నాకు గౌరవం ఉంది. మేము హిందీ భాషను గౌరవించి, నేర్చుకున్నాం గనకనే మీరు పెట్టిన ట్వీట్‌ ను చదివి అర్థం చేసుకోగలిగాను.. కానీ ఒకవేళ నేను నా పోస్టును కన్నడలో టైప్ చేసినట్లైతే పరిస్థితి ఏంటి సర్‌.. చదవగలరా అంటూ.. మేము ఇండియాకు చెందిన వాళ్లం కాదా సర్‌ అని ట్వీట్‌ చేశారు.

అయితే విషయం పక్కదారి పడుతోందని గుర్తించిన సుదీప్‌... తనకు అన్ని భాషల పట్ల గౌరవం ఉందని.. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని.. తన ఉద్దేశం అది కాదని అసలు విషయాన్ని మిమ్ముల్ని కలిసినప్పుడు వివరిస్తానని చెప్పారు. ఇక్కడితో దీన్ని వదిలేద్దామన్నారు. ఏ విషయమైనా సరైన రీతిలో అర్థమైతేనే స్పందన సరిగా ఉంటుందని.. లేనప్పుడే ఇలాంటి ఇబ్బందులు వస్తాయంటూ చెప్పుకొచ్చారు. దీనికి స్పందించిన అజయ్‌... నువ్వు నా స్నేహితుడివని.. అపార్థాన్ని తొలగించినందుకు ధన్యవాదాలు అని ట్వీట్‌ చేశారు. సినీ పరిశ్రమ అంతా ఒక్కటే అని తానెప్పుడూ భావిస్తానని.. తాను అన్ని భాషలను గౌరవిస్తానని.. అలాగే తన భాషను అందరూ గౌరవించాలని కోరుకుంటానని చెప్పారు.

అయితే ఈ వ్యవహారం ఇంతటితో ఆగలేదు. హీరో సుదీప్‌ చేసిన వ్యాఖ్యలకు… కన్నడ రాజకీయ నాయకులు మద్దతు పలికారు. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తో పాటు.. మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, కుమారస్వామి దీనిపై ఘాటుగా స్పందించారు. హిందీ ఎప్పుడూ మన జాతీయ భాష కాదన్న సిద్ధరామయ్య… భాషా భిన్నత్వాన్ని గౌరవించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు. కన్నడిగ అయినందుకు తాను గర్విస్తున్నాననంటూ ట్వీట్‌ చేశారు. ఇక కుమార స్వామి మరో అడుగు ముందుకేసి.. అజయ్‌ దేవ్‌గన్‌ బీజేపీ మౌత్‌పీస్‌ లా మాట్లాడారని మండిపడ్డారు. కన్నడ సినీ పరిశ్రమ ఎగుదలను అజయ్‌ గుర్తించాలని.. కన్నడిగుల ప్రోత్సాహం వల్లే హిందీ సినిమా ఎదిగిందని వ్యాఖ్యానించారు. అజయ్‌ మొదటి సినిమా పూల్‌ ఔర్‌ కాంటే బెంగళూరులో ఏడాది పాటు నడిచిందని గుర్తు చేశారు.

ఇక క్రియేటివ్‌ డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ సైతం దీనిపై స్పందిస్తూ…దక్షిణాది చిత్రాలు మంచి వసూళ్లతో దూసుకెళ్తున్న కారణంగా ప్రస్తుతం ఉత్తరాది స్టార్స్‌ అసూయతో ఉన్నారని విమర్శించారు. దక్షిణాది, ఉత్తరాది కాదు.. భారతదేశం మొత్తం ఒకటే అనేది ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. భాష ప్రజలు చేరువ కావడానికి దోహదపడుతుందని… విడదీయడానికి కాదని ఆర్జీవీ ట్వీట్‌ చేశారు. కేజీఎఫ్‌ -2 ... 50 కోట్ల ఓపెనింగ్స్‌ సాధించిందని.. ఇకపై బాలీవుడ్‌ చిత్రాల ఓపెనింగ్స్‌ ఎలా ఉంటాయో మనమూ చూద్దాం.. బాలీవుడ్‌లో బంగారం ఉందా.. కన్నడలో బంగారం ఉందా.. అన్నది రన్‌ వే 34 ఓపెనింగ్స్ తో తేలిపోతుందంటూ… వర్మ మరో ట్వీట్‌ చేశారు.

మొత్తానికి సినిమాల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు ఏకంగా జాతీయ భాష వైపు మళ్లడం.. పెను దుమారానికే దారి తీసింది. ఈ మాటల యుద్ధం ఇక్కడితోనే ఆగుతుందా.,. లేక మరింత ముందుకెళ్తుందా అన్నది వేచి చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story