Sivakarthikeyan: స్టార్ ప్రొడ్యూసర్‌పై కేసు పెట్టిన శివకార్తికేయన్..

Sivakarthikeyan: స్టార్ ప్రొడ్యూసర్‌పై కేసు పెట్టిన శివకార్తికేయన్..
Sivakarthikeyan: శివకార్తికేయన్ తాజాగా ఓ నిర్మాతపై కేసు పెట్టడం కోసం కోర్టు మెట్లు ఎక్కాడు.

Sivakarthikeyan: దాదాపుగా తమిళ హీరోలందరూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. చాలామంది తమిళ హీరోల డబ్బింగ్ సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్ అందుకుంటూ ఉంటాయి. అలా ఒకట్రెండు సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన తమిళ నటుడు శివకార్తికేయన్. ఈ మల్టీ టాలెంటెడ్ నటుడు తాజాగా ఓ నిర్మాతపై కేసు పెట్టడం కోసం కోర్టు మెట్లు ఎక్కాడు. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

ఒక సినిమా మొదలుపెట్టిన దగ్గర నుండి అది విడుదలయ్యి ప్రేక్షకుల దగ్గరికి వచ్చేవరకు అందరికంటే ఎక్కువ బాధ్యత నిర్మాతకే ఉంటుంది. నిర్మాత ఏ మాత్రం వెనక్కి తగ్గినా సినిమా ముందుకు సాగదు. అయితే శివకార్తికేయన్ నటించిన 'మిస్టర్ లోకల్' నిర్మాత కె. ఇ. జ్ఞానవేల్‌ రాజా తనకు ఇంకా పూర్తి పారితోషికం ఇవ్వలేదంటూ ఈ హీరో మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు.


మిస్టర్ లోకల్ సినిమా కోసం శివకార్తికేయన్ రూ. 15 కోట్లు పారితోషికం ఒప్పుకున్నాడట. అయితే అందులో కేవలం రూ. 11 కోట్లు మాత్రమే జ్ఞానవేల్‌ రాజా తనకు అందజేసినట్టు కోర్టుకు తెలిపాడు శివకార్తికేయన్. అంతే కాకుండా అందులో నుండి టీడీఎస్ రూ.91 లక్షలు కూడా శివకార్తికేయన్ అకౌంట్ నుండి కట్టాల్సి వచ్చిందని అన్నాడు.

మిస్టర్ లోకల్ సినిమా విడుదలయ్యి మూడేళ్లయినా.. ఇంకా జ్ఞానవేల్‌ రాజా ఈ విషయంపై స్పందించకపోవడంతో శివకార్తికేయన్ కోర్టును ఆశ్రయించాడు. జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్న తర్వాత సినిమాలపై కోర్టు స్టే విధించాలని, అంతే కాకుండా ఆ సినిమాల డిజిటల్, శాటిలైట్ రైట్స్‌కు కూడా స్టే ఇవ్వాలని కోరాడు. అయితే ఈ కేసు తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది.

Tags

Read MoreRead Less
Next Story