Bhadrachalam : భద్రాద్రి రాములోరి కళ్యాణం.. రెండేళ్ల తర్వాత భక్తుల మధ్య..

Bhadrachalam : భద్రాద్రి రాములోరి కళ్యాణం.. రెండేళ్ల తర్వాత భక్తుల మధ్య..
Bhadrachalam : కళ్యాణానికి సంబంధించిన అన్ని సంప్రదాయాలు పాటిస్తూ రాములోరి కళ్యాణం నిర్వహించనున్నారు.

Bhadrachalam : సీతారాముల కళ్యాణము చూతము రారండి.. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు.. ఎప్పుడు విన్నా మనసు ఆనందంతో పులకరించి పోతుంది. ప్రతి ఏటా అంగంరంగ వైభవంగా భద్రాచలంలో శ్రీరామనవమినాడు నిర్వహించే సీతారాముల కళ్యాణం గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా భక్తుల మధ్య నిర్వహించలేకపోయారు ఆలయ అర్చకులు, ప్రభుత్వాధికారులు.

కానీ ఈసారి కళ్యాణానికి సంబంధించిన అన్ని సంప్రదాయాలు పాటిస్తూ రాములోరి కళ్యాణం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 10న నిర్వహించే కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవమి వేడుకల కోసం భద్రాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయ ప్రాంగణాన్ని విద్యుద్ధీపాలతో అలంకరించారు.

భక్తుల కోసం చలువ పందిళ్లు, టెంట్లు ఏర్పాటు చేశారు. కళ్యాణం అనంతరం భక్తులకు తలంబ్రాలను పంపిణీ చేసేందుకు 60 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రసాదాల విక్రయాల కోసం ప్రత్యేక కౌంటర్లు వెలిశాయి. శుక్రవారం ధ్వజారోహణ కార్యక్రమం నేత్రపర్వంగా నిర్వహించారు ఆలయ అర్చకులు.

ఇక రెండేళ్ల తర్వాత నిర్వహించే కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ధ సంఖ్యలో భక్తులు తరలి వస్తారని భావిస్తున్నారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. 2020, 2021లో కళ్యాణ వేడుకలను పరిమిత సంఖ్యలో ప్రభుత్వ నేతలు, అధికారుల సమక్షంలో నిర్వహించారు.


ఆదివారం జరగనున్న కళ్యాణ మహోత్సవానికి మిథిలా స్టేడియం ముస్తాబైంది. ఈరోజు రాత్రి వైకుంఠ ద్వారం వద్ద శ్రీ సీతారామచంద్రస్వామి ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు.

స్వామివారి కళ్యాణానికి సీఎం కేసీఆర్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. సోమవారం జరిగే సీతారాముల మహాపట్టాభిషేకానికి గవర్నర్ తమిళిసై దంపతులు విచ్చేయనున్నారని తెలుస్తోంది.

భక్తుల సౌకర్యార్ధం తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 850 బస్సులు నడపనున్నారు. తెలంగాణ ఆర్టీసీ నుంచి 450 బస్సులు, ఏపీఎస్ ఆర్టీసీ నుంచి 400 బస్సులు భద్రాచలానికి బయలు దేరనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story