తెలుగురాష్ట్రాల్లోని ఆలయాలపై కరోనా ఎఫెక్ట్

తెలుగురాష్ట్రాల్లోని ఆలయాలపై కరోనా ఎఫెక్ట్
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ ఉగ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా ఆంక్షలు అమలవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఆలయాలను తాకింది.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ ఉగ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా ఆంక్షలు అమలవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఆలయాలను తాకింది. కరోనా ఉధృతి నేపథ్యంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని అన్ని చారిత్రక, పురాతన ఆలయాలు, కట్టడాలు, సందర్శన ప్రదేశాలు, మ్యూజియంలను వెంటనే మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈనేపథ్యంలో తెలుగురాష్ట్రాల్లోని పలు ఆలయాలపై ఈ ఎఫెక్ట్ పడింది.

తిరుమల శ్రీవారి ఆలయానికి కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో దర్శనాల సంఖ్య తగ్గించింది టీటీడీ. ఇప్పటికే సర్వదర్శనం టోకెన్లు నిలిపివేసిన అధికారులు.. భక్తుల సంఖ్యను కూడా తగ్గించింది. మే 1 నుంచి 15 వేల మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. 300 రూపాయల దర్శన టోకెన్లు 15వేలు మాత్రమే టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. ఈనెల 20న దర్శన టోకెన్లు విడుదల కానున్నాయి.

కొవిడ్ విజృంభణ నేపథ్యంలో శ్రీశైల క్షేత్రంలో హైఅలర్ట్ ప్రకటించారు ఆలయ అధికారులు. దేవస్థానం సిబ్బంది భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసి స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు ఆలయ ప్రవేశం ఉంటుంది.

మధ్యాహ్నం నుంచి వర్తక వ్యాపారాలను పూర్తిగా మూసివేయాలని దేవస్థానం రెవెన్యూ విభాగం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను పాటించని వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచించారు. అత్యవసరమైన మందుల దుకాణాలు మినహా ఇతర వ్యాపారాలేవీ నిర్వహించకూడదని తెలిపారు.

కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని శుక్రవారం నుంచి మూసివేశారు. మే 15 వరకు ఆలయంలోకి భక్తులను ఎవర్నీ అనుమతించబోమని ఆలయ అధికారులు తెలిపారు. అయితే, స్వామివారికి నిత్యం జరిగే పూజా కైంకర్యాలన్నీ యథావిధిగా కొనసాగుతాయన్నారు. కోదండరామాలయంతో పాటు కడప జిల్లాలోని మరో 15 ఆలయాలను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 21 నుంచి ఒంటిమిట్టలో శ్రీరామనవమి ఉత్సవాలు జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ వేడుకలు జరుగుతాయా? లేదా? అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది.

ఇక అనంతపురం జిల్లాలో ప్రముఖ క్షేత్రమైన లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో మే 15 వరకు భక్తులకు ప్రవేశాన్ని నిలిపివేశారు ఆలయ అధికారులు. లేపాక్షి నంది విగ్రహం వద్ద కూడా పర్యాటకులకు ప్రవేశం లేదని, నంది విగ్రహం పార్కింగ్‌ను కూడా మూసివేశామని తెలిపారు. దక్షిణకాశిగా పిలువబడే పుష్పగిరిలోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని కూడా అధికారులు మూసివేశారు.

Tags

Read MoreRead Less
Next Story