ఉగాది వరకు వైభవంగా జరగనున్న కొమురవెల్లి మల్లన్న జాతర

ఉగాది వరకు వైభవంగా జరగనున్న కొమురవెల్లి మల్లన్న జాతర
కొమురవెళ్లి మల్లన్న జాతరకు హైదరాబాద్ నుండీ సుమారు లక్షమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.

సిద్ధిపేట జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న స్వామి జాతర ఘనంగా జరుగుతోంది. సంక్రాంతి పండుగ తరువాత వచ్చే మొదటి ఆదివారంతో మొదలైన జాతర ఉగాది పర్వదినం వరకు కొనసాగనుంది. యాదవుల ఆడబిడ్డ అయిన గొల్ల కేతమ్మను మల్లన్న స్వామి వివాహమాడిన సందర్భంగా మొదటి ఆదివారం హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో యాదవులు తరలి వచ్చి స్వామి వారికి పట్నాలు వేసి, బోనాలు సమర్పిస్తారు. అందుకే ఈ ఆదివారాన్ని పట్నం వారంగా పిలుస్తారు. శనివారం మల్లన్న స్వామికి ఓడిబియ్యం సమర్పించి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆదివారం మల్లన్న సోదరి అయిన ఎల్లమ్మకు, మల్లన్నకు మట్టిపాత్రలో బోనం, పంచరంగులతో పట్నం సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. జాతరకు తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యలు కలుగకుండా మంచినీటి వసతి, కోనేరులో నీటి సౌకర్యం, అంబులెన్స్ సౌకర్యం, వాహనల కొరకు పార్కింగ్ స్ధలాలను ఏర్పాటు చేశారు. ఇక సోమవారం యాదవులు నిర్వహించే అగ్నిగుండాలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని అధికారులు తెలిపారు.

గొల్ల కురుమల ఆరాధ్య దైవమైన కొమురవెళ్లి మల్లన్న జాతరకు హైదరాబాద్ నుండీ సుమారు లక్షమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని పునరుద్ధరణ కమిటీ చైర్మన్ దువ్వాల మల్లయ్య పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ యాదవులు అగ్ని గుండం కార్యక్రమం నిర్వహిస్తారని.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story