దైవదర్శనం : కోరిన కోరికలు తీర్చే కొండగట్టు అంజన్న..

దైవదర్శనం : కోరిన కోరికలు తీర్చే కొండగట్టు అంజన్న..
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్దికెక్కిన పుణ్యక్షేత్రాలలో కొండగట్టు ఒకటి.. ఇక్కడ కొలవై ఉన్న ఆంజనేయస్వామిని కొండగట్టు అంజన్న అని భక్తులు కోలుచుకుంటారు.

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్దికెక్కిన పుణ్యక్షేత్రాలలో కొండగట్టు ఒకటి.. ఇక్కడ కొలవై ఉన్న ఆంజనేయస్వామిని కొండగట్టు అంజన్నగా భక్తులు కోలుచుకుంటారు. ద్వీముఖాలతో భక్తులకి దర్శనం ఇచ్చే రామబంటు విశేషాలే.. ఈ రోజు మన 'దైవదర్శనం'.

ఈ పుణ్యక్షేత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉంది. తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డాక జిల్లాల పునర్వ్యవస్థీకరణలో జగిత్యాల జిల్లాలోకి వెళ్ళింది. మల్యాల మండలం ముత్యంపేట అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది. కరీంనగర్ జిల్లా నుంచి 35 కీ.మీ దూరం ఉంటుంది.

ఆలయ చరిత్ర :

ఈ ఆలయానికి రెండు చరిత్రలు ఉన్నాయి. రామాయణం ప్రకారం.. రామరావణ యుద్ధము జరుగుతున్న సమయంలో లక్ష్మణుడు మూర్చనొందగా సంజీవనిని తెచ్చేందుకు హనుమంతుడు బయలుదేరుతాడు. హనుమ సంజీవనిని తెచ్చే క్రమంలో ముత్యంపేట అనే గ్రామంలో ఆ సంజీవని కొంత భాగం విరిగి కింద పడిందని, ఆ భాగమే కొండగట్టుగా వెలసిందని చరిత్ర చెబుతుంది.

ఇక రెండో చరిత్ర చూస్తే.. సింగం సంజీవుడు అనే యాదవుడు తన ఆవులు మేపుతూ ఈ ప్రాంతానికి వచ్చాడట.. ఈ క్రమంలో ఆవుల మందలోని ఓ ఆవు తప్పిపోయిందట.. ఆ ఆవు కోసం సంజీవుడు ఎంత వెతికినా దొరకకపోవడంతో అలిసిపోయి ఓ చెట్టు వద్ద సేదతీరాడట.. అప్పుడు ఆంజనేయస్వామి ఆ సంజీవుడి కలలో కనిపించి నేనిక్కడ కోరంద పొదలో ఉన్నాను. నాకు ఎండ, వాన, ముండ్ల నుండి రక్షణ కల్పించు, నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడు. సంజీవుడు కళ్ళు తెరిచి చూసే సరికి ఆవును వెతకగా, 'శ్రీ ఆంజనేయుడు' కంటపడ్డాడు. అప్పుడు దూరం నుండి ఆవు 'అంబా' అంటూ ఆవూ పరిగెత్తుకు వచ్చిందని స్థలపురాణం చెబుతుంది..

శంఖు చక్ర గదాలంకరణతో శ్రీ ఆంజనేయ స్వామివారు విశ్వరూపమైన పంచముఖాలలో ఒకటైన నారసింహ వక్త్రంతో ఉత్తరాభిముఖంగా ఉన్నరూపంతో కనిపించాడట. ఆ తరవాత తన తోటివారిని పిలిచి స్వామి వారికి ఆలయాన్ని నిర్మించాడట.. ప్రస్తుతం ఉన్న ఈ దేవాలయము 160 సంవత్సరాల క్రితము కృష్ణారావు దేశ్‌ముఖ్‌ చే కట్టించబడిందని పురాణాలు చెబుతున్నాయి.

ఆలయ ప్రత్యేకతలు :

♦ నారసింహస్వామి ముఖం (వక్త్రం) ఆంజనేయస్వామి ముఖం, రెండు ముఖాలతో వేంచేసి యుండటం ఈ క్షేత్రం ప్రత్యేకత.

♦ నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి కొండగట్టు ఆంజనేయస్వామి వారికి స్వయంగా నారసింహవక్త్రం, శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు, సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉండటం విశేషం.

♦ స్వామి వారికి క్షేత్ర పాలకుడిగా శ్రీబేతాళ స్వామి ఆలయం కొండపైన నెలకొని ఉంది.

♦ ఈ గుడిలో 40 రోజుల పాటు పూజ చేస్తే సంతానము లేని వారికి సంతానము కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.

♦ వైష్ణవ ఆగమ సంప్రదాయం ఆధారంగా స్వామి వారికి పూజలు చేస్తారు.

♦ ఈ ఆలయంలో ప్రతి మంగళ, శని వారాలలో ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు.

♦ శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం, కృష్ణాష్టమి, విజయదశమి మొదలగు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు.

♦ హనుమంతుని దీక్షను తీసుకున్నవారు భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తారు.

♦ పెద్ద హనుమాన్, చిన్న హనుమాన్ దీక్షలను చాలా ఘనంగా జరుపుతారు.

♦ హైదరాబాదు, కరీంనగర్ నుంచి బస్సు సౌకర్యం కలదు. జగిత్యాల జిల్లా నుంచి ప్రతి 30 నిమిషాలకో బస్సు ఉంటుంది. ఆటో సౌకర్యం కూడా కలదు.

Tags

Read MoreRead Less
Next Story