5వ శతాబ్ధంలో నిర్మించిన శ్రీకాళహస్తీశ్వరాలయం.. మూడు జీవులు శివైక్యం పొందిన పుణ్య క్షేత్రం

5వ శతాబ్ధంలో నిర్మించిన శ్రీకాళహస్తీశ్వరాలయం.. మూడు జీవులు శివైక్యం పొందిన పుణ్య క్షేత్రం
అనంత కోటి జీవరాసుల్లో ఆ మూడు జీవరాసులు మాత్రమే లంబోదరుడితో సమానంగా సేవలందుకుంటున్నాయి..

భక్తితో మనస్ఫూర్తిగా ఆ పరమ శివునికి సేవలందించాలనుకున్నాయి. ఒకదానితో ఒకటి పోటీ పడుతూ పరమశివునికి పాత్రులవ్వాలనుకున్నాయి.. అనంత కోటి జీవరాసుల్లో ఆ మూడు జీవరాసులు మాత్రమే లంబోదరుడితో సమానంగా సేవలందుకుంటున్నాయి.. శివుని సాన్నిధ్యమైన శ్రీకాళహస్తిలో కొలువై వున్నాయి. చిత్తూరు జిల్లా తిరుపతికి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తిలో స్వయంభువగా వెలసిన ఫణి రూప లింకారాకంలో దర్శనమిస్తారు. దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన దివ్యక్షేత్రం శ్రీకాళహస్తి. స్వర్ణముఖీ నదీ తీరాన వెలసిన స్వయంభుగా పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రం.

శివుని ఆరాధనలో సాలెపురుగు, పాము, ఏనుగు..

శివయ్యకు పందిళ్లు వేసిన సాలెపురుగు..

కృతయుగంలో సాలెపురుగు కొండ మీద శివలింగానికి అర్చన చేసి దారాలతో పందిళ్లు కట్టేది. అలుపెరుగక ప్రతి రోజూ అదే పని చేసేది.. ఒక రోజు సాలెపురుగు భక్తిని పరీక్షించాలనుకున్న శివుడు అది నిర్మించిన పందిళ్లను పక్కనే ఉన్న దీపం ద్వారా అంటుకునేలా చేస్తాడు. అది చూసి తల్లడిల్లిపోయిన సాలీడు ఆ దీపాన్ని మింగి మరణిస్తుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా శివైక్యం కోరుకుంటుంది సాలీడు. అందులకు పరమేశ్వరుడు సంతసించి తథాస్తు అంటారు.

అలాగే పాము.. పాతాళ లోకం నుంచి మణిమాణిక్యాలు తెచ్చి ప్రతి రోజు లింగార్చన చేసేది. ఈ క్రమంలోనే త్రేతాయుగం ముగిసి ద్వాపరయుగం ప్రవేశించింది. అప్పుడు శివలింగాన్ని పూజించడానికి ఒక ఏనుగు వచ్చింది. అది రోజూ స్వర్ణముఖి నదిలో స్నానం చేసి మారేడు దళాలు, పూలు తెచ్చి శివలింగంపై ఉన్న మణులను తొండంతో తోసివేసి తాను తెచ్చిన పూజాద్రవ్యాలతో పరమశివుడిని పూజించేది. ఆ మర్నాడు వచ్చిన సర్పం ఏనుగు పూజాద్రవ్యాలను తొలగించి తాను తెచ్చిన మణులతో అర్చన చేసేంది.

ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి. ఓ రోజు పాము అక్కడే పక్కన దాక్కుని ఏనుగు చర్యలను గమనించసాగింది. తొండంతో నీళ్లు తెచ్చి శివలింగంపై పోస్తున్న తరుణంలో పాము కోపంతో ఏనుగు తొండంలోకి ప్రవేశించి కుంభస్థలంలోకి చేరుకుంది. పాము లోపలికి దూడంతో ఏనుగు తల తిరిగింది. తన కుంభస్థలాన్ని కొండకేసి ఢీకొట్టింది. కుంభస్థలం పగిలిపోయింది. ఏనుగు, పాము రెండూ మరణించాయి. శివుని కృపాకటాక్షాలతో ఆ రెండు జీవులు లింగంలో ఐక్యమయ్యాయి. అలా ఆ విధంగా మూడు జీవులు శ్రీ- సాలెపురుగు, కాళ-పాము, హస్తి-ఏనుగు.. శివుడు శ్రీకాళహస్తీశ్వరునిగా పూజలందుకొంటున్నాడు.

రాహు-కేతు క్షేత్రంగా ప్రసిద్ధి

శ్రీకాళహస్తీశ్వరాలయం రాహు-కేతు సర్పదోష నివారణ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ రాహు, కేతువులు ఉన్నందున గ్రహణ సమయాల్లో సైతం గుడి తలుపులు తెరిచే ఉంటాయి. ఈ క్షేత్రంలో కొలువై వున్న త్రినేత్రుడు నవగ్రహ కవచాన్ని నిత్యం ధరించి ఉంటాడు. అందుకే ఆయనకు గ్రహణ దోషాలు కలగవు. ఆ సమయంలో ఇక్కడ సర్వాభిషేకాలు చేస్తారు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శన భాగ్యంతో భక్తులు పునీతులవుతారు.

Tags

Read MoreRead Less
Next Story