Maha Shivratri 2022: మహాశివరాత్రి విశిష్టత.. జాగారం ప్రాముఖ్యత

Maha Shivratri 2022: మహాశివరాత్రి విశిష్టత.. జాగారం ప్రాముఖ్యత
Maha Shivratri 2022: జీవితంలో చీకటిని, అజ్ఞానాన్ని పారద్రోలాలని ఈ పండుగ గుర్తు చేస్తుంది.

Maha Shivratri 2022... భోగభాగ్యాలకు అతీతుడు. కాసులు, కానుకలు కోరుకోడు.. మనసు నిండుగా భక్తి, ఆరాధనతో నీళ్లతో అభిషేకించినా పరమ శివుడు సంతుష్టుడవుతాడు. భక్తుని కోర్కెలు తీర్చే భోళా శంకరుడు ఆ త్రినేత్రుడు.. పార్వతీదేవిని తన సగభాగంలో చోటిచ్చి అర్థనారీశ్వరుడయ్యాడు.

ఈ సంవత్సరం, మహా శివరాత్రి పండుగ మార్చి 1, 2022 మంగళవారం వస్తుంది. హిందువులు ప్రతి ఏటా జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగలలో ఇది ఒకటి.

మహా శివరాత్రి అంటే శివనామస్మరణతో రాత్రి అంతా చేసే జాగారం. దృక్ పంచాంగ్ ప్రకారం, ఇది మాఘ మాసంలో కృష్ణ పక్షంలో చతుర్దశి తిథి నాడు వస్తుంది. చాంద్రమాన హిందూ క్యాలెండర్‌లో ప్రతి నెల శివరాత్రి పండుగ గుర్తించబడుతుంది. అయితే, మహా శివరాత్రి మాత్రం సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుపుకుంటారు. ఫిబ్రవరి లేదా మార్చిలో శీతాకాలం ముగిసిపోతూ వేసవి ప్రారంభంలో ఉంటుంది. శివ, శక్తి కలయిక యొక్క రాత్రిగా భావించబడటం వలన మహాశివరాత్రిని శుభప్రదంగా పరిగణిస్తారు భక్తులు.

మహా శివరాత్రి ప్రాముఖ్యత


హిందూ పురాణాల ప్రకారం, మహా శివరాత్రి సందర్భంగా శివుడు, పార్వతి వివాహం చేసుకుంటారు. పరమశివుడు పురుషుడిని సూచిస్తే - పార్వతి మాత ప్రకృతిని సూచిస్తుంది. వీరి కలయిక సృష్టిని ప్రోత్సహిస్తుంది. జీవితంలో చీకటిని, అజ్ఞానాన్ని పారద్రోలాలని ఈ పండుగ గుర్తు చేస్తుంది.

అనేక పురాణ ఇతిహాసాల ప్రకారం మహాశివ రాత్రి రోజు జాగారం చేసి శివుడిని ప్రార్థించడం ద్వారా తమ పాపాలను అధిగమించి, ధర్మమార్గంలో ప్రయాణించేందుకు తోడ్పడుతుంది. అలాగే ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల శుభం కలుగుతుందని నమ్ముతారు.

పూజా సమయం: అర్థరాత్రి 12: 8 నుండి 12:58


భారతదేశంలోని ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ వంటి అనేక రాష్ట్రాల్లో మహా శివరాత్రి జరుపుకుంటారు. ఈ రోజున, శివ భక్తులు ఒక రోజంతా ఉపవాసం ఉంటారు, దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులు శివలింగానికి పాలతో అభిషేకం చేసి, మోక్షం ప్రసాదించమని ప్రార్థిస్తారు.

శివరాత్రి రోజున, ఉదయం ఆచారాలను ముగించిన తర్వాత, భక్తులు సంకల్పం తీసుకొని రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు ఆహారం తీసుకోవాలని శాస్త్రం చెబుతోంది. అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసాన్ని ఆచరించడం అంత శ్రేయస్కరం కాదు. షుగర్ లెవల్స్ పడిపోతాయి.. బీపీ డౌన్ అవుతుంది.. పాలు, పండ్లు తీసుకుంటూ శరీరం నీరసించకుండా చూసుకోవాలి.. నిజానికి ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం. మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా భక్తితో శివనామస్మరణను, ఓంకారాన్ని జపిస్తూ ఉండాలని అంటారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉపవాసం ముగించేందుకు శివుని అనుగ్రహాన్ని పొందాలి.

Tags

Read MoreRead Less
Next Story