Ugadi: తెలుగు సంవత్సరం ఉగాది.. పండుగ ప్రాముఖ్యత

Ugadi: తెలుగు సంవత్సరం ఉగాది.. పండుగ ప్రాముఖ్యత
Ugadi: హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం మొదటి రోజున ఉగాది జరుపుకుంటారు.

Ugadi: పండుగ.. ఆ పేరులోనే ఏదో పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది.. ఎవరికైనా, ఎక్కడ ఉన్నా పండుగ వచ్చిందంటే ఎంతో ఆనందం.. ఇక తెలుగు వారికి అటు కన్నడిగులకు అత్యంత ప్రీతి పాత్రమైన పండుగ ఉగాది.. ఈ పండుగ ఈ ఏడాది ఏప్రిల్ 2న జరుపుకుంటున్నారు.

ఉదయాన్నే లేచి ఇల్లు, వాకిళ్లు శుభ్రం చేసుకుని కొత్త బట్టలు ధరిస్తారు. గుమ్మానికి మామిడితోరణాలు, పూలదండలు గుచ్చడంతో లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్లుగా ఉంటుంది ప్రతి ఇంటి లోగిలి. ఉగాది రోజు గణపతిని, విష్ణుమూర్తిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తుంటారు ప్రజలు.

పండుగ రోజు చేసే ఉగాది పచ్చడి కూడా చాలా ప్రత్యేకమైనది.. జీవితంలో కష్టసుఖాలను సూచిస్తూ ఉగాది ప్రసాదాన్ని తయారు చేస్తారు. చేదుగా ఉండే వేపపువ్వు, చింతపండు, బెల్లం, మామిడికాయలను ఉపయోగించి తయారు చేసే ఉగాది పచ్చడి ఎంతో రుచికరంగా ఉంటుంది. ఆరోగ్యాన్నీ అందిస్తుంది.

ఉగాది పచ్చడి ఎండ వేడిమి నుంచి రక్షణ కల్పించి శరీరాన్ని చల్లబరుస్తుంది. అందుకే ఈ పచ్చడిని కొత్త కుండలో కొంచెం ఎక్కువగానే తయారు చేస్తారు. ఇంటికి వచ్చిన వారికి ఇస్తారు.

ఇంకా ఉగాది రోజు స్పెషల్ గా చేసే పిండి వంటల్లో ప్రముఖ స్థానం బొబ్బట్లది. దేవుడికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో అందరూ ఇష్టంగా ఆరగిస్తారు.


హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం మొదటి రోజున ఉగాది జరుపుకుంటారు. ఈ రోజును మరాఠీ, కొంకణి ప్రాంతాల వారు గుడి పడ్వాగా జరుపుకుంటారు. ఈ పండుగను చాలా ఆనందంతో, ఉత్సాహంతో జరుపుకుంటారు ఆయా ప్రాంతాలవారు.

యుగాది రెండు పదాలతో ఏర్పడింది. యుగ అంటే యుగం, ఆది అంటే ప్రారంభం అని అర్థం. ఉగాది అనే పదాన్ని తెలుగు ప్రజలు ఉపయోగిస్తారు. అయితే కర్ణాటక ప్రజలు యుగాది అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఏ భాషతో పిలిచిన పండుగ ఆంతర్యం ఒక్కటే.

ఉగాది చరిత్ర

ప్రసిద్ధ పురాణాల ప్రకారం, ఉగాది రోజున బ్రహ్మ దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు. బ్రహ్మ దేవుడు కాలాన్ని రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలను ఇదే రోజున పరిచయం చేశాడని ప్రసిద్ధ గ్రంధాలు చెబుతున్నాయి. కాబట్టి, ఉగాది విశ్వం యొక్క ప్రారంభం లేదా మొదటి రోజు.

హిందూ గ్రంధాల ప్రకారం, యుగాదికృత్ అనేది విష్ణువు యొక్క అనేక పేర్లలో ఒకటి. యుగాల సృష్టికర్త విష్ణుమూర్తి. అందుకే కన్నడిగులు, తెలుగు వారు శ్రీమహావిష్ణువును ఆరాధించి తమ జీవితాలలో సుఖ సంతోషాలు ప్రాప్తించాలని భక్తితో ఆరాధిస్తారు.

ఉగాది ప్రాముఖ్యత -

ఉగాది పండుగ వసంత రుతువు ఆగమనాన్ని సూచిస్తుంది. కొత్త శకానికి నాంది పలుకుతుంది. కాబట్టి, ఈ పండుగ ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైనది.

Tags

Read MoreRead Less
Next Story