TTD : పలు కీలక నిర్ణయాలకు టీటీడీ పాలకమండలి ఆమోదం

TTD : పలు కీలక నిర్ణయాలకు టీటీడీ పాలకమండలి ఆమోదం
TTD : టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా కారణంగా రెండేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది.

TTD : టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా కారణంగా రెండేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. సిఫార్సు లేఖలపై కేటాయించే ఆర్జిత సేవా టికెట్ల ధరలను పెంచేందుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈనెలాఖరులోగా తిరుమలలో సాధారణ పరిస్థితులు తెస్తామన్నారు. ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిపై రెండ్రోజుల్లో ప్రకటన చేస్తామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు.

అయితే సిపార్సు లేఖలపై జారీ చేసే ఆర్జిత సేవా టికెట్ల ధరలను పెంచాలని టీడీపీ పాలకమండలి నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి. సిఫార్సు లేఖలను తగ్గించాల్సిన టీటీడీ.. ఆదాయాన్ని పెంచుకోవడం కోసమే ధరలు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిందని భక్తులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ పెంచుకునేందుకు టీటీడీ పాలకమండలి.. దేవాలయాలను ఆదాయమార్గంగా ఎంచుకుంటోందని భక్తులు విమర్శిస్తున్నారు.

ఇక.. అన్నమయ్య భవనంలో జరిగిన సమావేశంలో టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మొత్తం 3 వేల 96 కోట్లతో వార్షిక బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం తెలిపింది. సుప్రభాతం 2 వేలు, తోమాల, అర్చన 5 వేలు, కళ్యాణోత్సవం 2 వేల 500, వేద ఆశ్వీరవచనం 10 వేల రూపాయలకు పెంచింది టీటీడీ. అలాగే 230 కోట్ల రూపాయలతో పిల్లల ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

2 కోట్ల 73 లక్షలతో స్విమ్స్‌ ఆసుపత్రి ఆధునికీకరణ చేపట్టాలని నిర్ణయించింది. టీటీడీ ఉద్యోగులకు నగదురహిత వైద్య సేవలకు 25 కోట్లు కేటాయించింది. అన్న ప్రసాద భవనంలో ఆహారం తయారీకి సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు, కొండపైన అన్ని చోట్లా అన్న ప్రసాదం అందించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. తిరుపతి సైన్స్‌సెంటర్‌ భూమిలో 50 ఎకరాలు వెనక్కి తీసుకునేందుకు ఆమోదం తెలిపిన పాలకమండలి.. తిరుపతిలో 50 ఎకరాల్లో ఆధ్యాత్మిక నగరం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో సర్వదర్శనం కోటా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. అలాగే శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయించారు.. మరోవైపు శ్రీవారి ఆలయ మహద్వారం, బంగారు వాకిలికి బంగారు తాపడం ఏర్పాటు చేయాలని టీటీడీ.. పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story