ఒక్కడోసు కూడా తీసుకోని వారికి మరింత ముప్పు: సీసీఎంబీ డైరెక్టర్

ఒక్కడోసు కూడా తీసుకోని వారికి మరింత ముప్పు: సీసీఎంబీ డైరెక్టర్
హైదరాబాద్ వస్తున్న విదేశీ ప్రయాణీకులపై దృష్టి సారించారు. పాజిటివ్ అని తేలిన వారి నమూనాలను ల్యాబ్‌లో పరీక్షిస్తున్నారు.

కరోనా వ్యాక్సిన్ ఒక్కడోసు కూడా తీసుకోని వారికి ప్రమాదం పొంచి ఉందని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ వినయ్ కుమార్ నందికూరి పేర్కొన్నారు.

ఒమిక్రాన్ వ్యాప్తి భయాందోళనలు నెలకొంటున్న నేపథ్యంలో వీటి జన్యుక్రమాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. హైదరాబాద్ వస్తున్న విదేశీ ప్రయాణీకులపై దృష్టి సారించారు. పాజిటివ్ అని తేలిన వారి నమూనాలను ల్యాబ్‌లో పరీక్షిస్తున్నారు. వీటి ద్వారా జన్యుక్రమాలను కనుగొనే ప్రక్రియ చేపట్టారు.

కొత్త వేరియంట్ ముప్పు కనీసం ఒక్క డోసు కూడా తీసుకోని వారికి అధికంగా ఉంటుందని అన్నారు. ఇక ఒక్క డోసు తీసుకున్న వారితో పోలిస్తే రెండు డోసులు తీసుకున్నవారికి రక్షణ ఎక్కువ. టీకా రెండు డోసులు తీసుకున్నా కోవిడ్ బారిన పడే వారూ ఉన్నారు. అయితే వారికి ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటుందనే విషయాన్ని గమనించాలని వివరించారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ముప్పు ఎక్కువ. కొత్త రకం వైరస్‌లో స్పైక్ ప్రొటీన్‌లో 32 ఉత్పరివర్తనాల కారణంగా అది రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకుంటుందని అంచనా.

ఈ విషయంపై మరింత అధ్యయనాలు జరిపితే తప్ప కొత్త వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనేది చెప్పలేం అంటున్నారు. అధిక రక్షణకు బూస్టర్ తప్పనిసరి. అయితే దీనిపై ప్రభుత్వం ప్రాధాన్యాలను బట్టి నిర్ణయం తీసుకుంటుంది. ఇంకా కొంత మంది ఒక్క డోసు కూడా తీసుకోలేదు.. రెండో డోసు చాలా మంది తీసుకోవాల్సి ఉంది. ఇక 12 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంది అని వినయ్ కుమార్ పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story