రూ. 2వేల నోట్లపై కేంద్రం స్పష్టత..!

రూ. 2వేల నోట్లపై కేంద్రం స్పష్టత..!
దేశవ్యాప్తంగా రెండు వేల రూపాయల నోట్లపై ఆసక్తికరమైన, ఉత్కంఠభరితమైన చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్‌ 8న పెద్దనోట్లు నోట్లు రద్దు చేసింది.

దేశవ్యాప్తంగా రెండు వేల రూపాయల నోట్లపై ఆసక్తికరమైన, ఉత్కంఠభరితమైన చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్‌ 8న పెద్దనోట్లు నోట్లు రద్దు చేసింది. ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లు చెల్లవని తేల్చిచెప్పింది. అనంతరం... కొత్త ఐదు వందలు, రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది. కానీ... ఆర్‌బీఐ రెండేళ్ల నుంచి రెండు వేల రూపాయ నోట్లు ముద్రించడం లేదు. దీనితో రెండు వేల రూపాయల నోట్లను కేంద్రం రద్దు చేస్తుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపైన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో క్లారిటీ ఇచ్చింది.

ఆర్‌బీఐ రెండేళ్లుగా రెండు వేల రూపాయల నోట్లు ముద్రించడం లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో స్పష్టంచేసింది. వీటి సంఖ్య కూడా తగ్గిందని వెల్లడించింది. లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు... కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాగూర్‌ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2019 ఏప్రిల్‌ నుంచి ఒక్క నోటు కూడా ముద్రణ జరగలేదని స్పష్టంచేశారు. 2018 మార్చి 30 నాటికి దేశంలో 3వేల 362 మిలియన్ల రెండు వేల రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయని అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. సంఖ్యా పరంగా మొత్తం నోట్లలో వీటి వాటా 3.27 శాతం కాగా.... విలువ పరంగా 37.26 శాతంతో సమానమని చెప్పారు. ప్రస్తుతం నోట్ల సంఖ్య తగ్గిందని తెలిపారు.

2021 ఫిబ్రవరి 26 నాటికి 2వేల 499 మిలియన్ల నోట్లు మాత్రమే చలామణీలో ఉన్నాయని చెప్పారు. సంఖ్యా పరంగా ఈ వాటా 2.01 శాతం కాగా.. విలువ పరంగా 17.78 శాతమని అనురాగ్‌ ఠాగూర్‌ తెలిపారు. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా ఎన్ని నోట్లు ముద్రించాలనేది ఆర్‌బీఐని సంప్రదించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2వేల రూపాయిల ముద్రించాలని కోరుతూ ఎలాంటి అభ్యర్థన రాలేదని చెప్పారు.

రెండు వేల రూపాయల నోట్ల చలామణి తగ్గిపోయిందని కేంద్రం స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో... నోట్ల రద్దుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నోట్లు సర్క్యులేషన్‌లో లేవని కేంద్రం చెప్పిందంటే... నల్లధనంగా మారిందని పరోక్షంగా చెప్పిందా అనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నల్లధన సర్పాల కోరలు కత్తిరించేందుకు.... మళ్లీ నోట్లు రద్దు చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఇక... కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story