కర్నాటకలో కొలువుదీరిన కొత్త కేబినెట్.. యుడ్యూరప్ప కుమారుడికి దక్కని చోటు..!

కర్నాటకలో కొలువుదీరిన కొత్త కేబినెట్.. యుడ్యూరప్ప కుమారుడికి దక్కని చోటు..!
ఇటీవలే యడ్యూరప్ప సీఎం పదవి నుంచి వైదొలిగిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎంపికైన బసవరాజ్ బొమ్మై కొత్త కేబినెట్ కొలువుదీరింది.

ఇటీవలే యడ్యూరప్ప సీఎం పదవి నుంచి వైదొలిగిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎంపికైన బసవరాజ్ బొమ్మై కొత్త కేబినెట్ కొలువుదీరింది. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్.. నూతన మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. రెండుసార్లు ఢిల్లీ వెళ్లి బీజేపీ అధిష్టానంతో చర్చించిన తర్వాత సీఎం బసవరాజ్ బొమ్మై 29 మందితో కొత్త జట్టును ఎంపిక చేశారు. అయితే.. కొత్త మంత్రివర్గం కూర్పులో మాజీ సీఎం యడ్యూరప్పకు నిరాశ తప్పలేదు. యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రకు కేబినెట్‌లో చోటు దక్కలేదు. యుడ్యూరప్ప తనయుడికి మంత్రి పదవి వస్తుందని ఆయన వర్గం ఆశించినా.. బీజేపీ అధిష్టానం హ్యాండ్ ఇచ్చింది. సీఎం పదవికి గట్టి పోటీ అనుకున్న అర్వింద్ బెల్లాడ్‌కు సైతం ఎలాంటి పదవీ దక్కలేదు.

కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవారిలో గోవింద్‌ కర్జోల్‌, కేఎస్‌ ఈశ్వరప్ప, ఆర్‌.అశోక‌, బి.శ్రీరాములు, వి.సోమన్న, ఉమేశ్‌ కత్తి సహా మొత్తం 29 మంది ఉన్నారు. రాష్ట్రంలో బలమైన వర్గమైన లింగాయత్‌లకు పెద్దపీట వేశారు. బొమ్మై జట్టులో ఎనిమిది మంది లింగాయత్‌ వర్గానికి చెందినవారికి కేబినెట్‌లో చోటు కల్పించగా.. ఒక్కళిగల నుంచి ఏడుగురు , ఓబీసీ నుంచి ఏడుగురు, ఎస్సీ సామాజికవర్గం నుంచి ముగ్గురు, ఎస్టీ నుంచి ఒకరు, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరు, మహిళల నుంచి ఒకరికి ప్రాతినిధ్యం కల్పించారు. సామాజిక సమీకరణాల ఆధారంగా కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ హైకమాండ్.. ఉప ముఖ్యమంత్రులుగా ఎవరినీ ఎంపిక చేయలేదు.

2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పక్కా వ్యూహంతో కొత్త మంత్రుల జాబితాను ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. అనుభవజ్ఞులతో పాటు కొత్త ముఖాల కలయికతో ఈ కేబినెట్‌ను రూపొందించినట్లు సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డా మార్గదర్శకత్వంలో కర్నాటక ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి బొమ్మై చెప్పారు. మొత్తానికి అనేక నాటకీయ పరిణామాలతో మలుపులు తిరిగిన కర్నాటకలో కొత్త కేబినెట్ కొలువుదీరింది. మరి నూతన సీఎం బసవరాజ్ బొమ్మై పాలన ఎలా ఉండబోతోంది..? కర్నాటక 2023 ఎన్నికల నాటికి బీజేపీ బలం ఎంత బలపడుతుందనేది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story