ప్రేమంటే ఇదేరా.. అప్పుడు మనసిచ్చాడు.. ఇప్పుడు జీవితాన్నిచ్చాడు..

ప్రేమంటే ఇదేరా.. అప్పుడు మనసిచ్చాడు.. ఇప్పుడు జీవితాన్నిచ్చాడు..
ఆమె కోసం అతడు చేసిన నిరీక్షణ 65 ఏళ్లకి ఫలించింది.

35 ఏళ్ల వారి ప్రేమ కథకు మూడుముళ్లతో ముగింపు పలికారు. ఆమె కోసం అతడు చేసిన నిరీక్షణ 65 ఏళ్లకి ఫలించింది. కర్ణాటక హెబ్బాళ్‌కి చెందిన చిక్కన్న అనే వ్యక్తికి 65 ఏళ్లు. 30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పక్కింటి అమ్మాయి జయమ్మను ప్రేమించాడు. కానీ ఆమె మాత్రం ప్రేమా గీమా లేదని పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది.

పెళ్లైన కొద్ది కాలానికే జయమ్మ భర్త చనిపోయాడు.. పిల్లలు కూడా లేకపోవడంతో బంధువుల పంచన చేరి ఒంటరిగా జీవితాన్ని సాగిస్తోంది.. చిక్కన్న మాత్రం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయాడు.. తాను ప్రేమించిన వ్యక్తి తనను కాదన్న వేదనతో జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడు.

ఇటీవల జయమ్మ ఒంటరిగా ఉందని తెలిసి ఆవేదన చెందాడు. ఆమెకు మరోసారి తన ప్రేమను తెలియజేయాలని నిర్ణయించుకున్నాడు. తన కోసం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్నాడని తెలిసి జయమ్మ మనసు కరిగిపోయింది. వెంటనే పెళ్లికి అంగీకరించింది. బంధువుల సమక్షంలో వీరిద్దరూ మేలుకోటే ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.

పెళ్లిలో భాగంగా ఆమెకు అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లను ఆకట్టుకుంది ఈ జంట. ఎవరికి ఎవరు అనేది ముందే రాసిపెట్టి ఉంటుందంటే ఇదే కాబోలు అని చర్చించుకుంటున్నారు. లేటు వయసులో ఘాటు ప్రేమ అని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ జంట పెళ్లి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story