దేశంలో కలకలం రేపుతోన్న బర్డ్ ఫ్లూ .. పెద్దసంఖ్యలో చనిపోతున్న పక్షులు

దేశంలో కలకలం రేపుతోన్న బర్డ్ ఫ్లూ .. పెద్దసంఖ్యలో చనిపోతున్న పక్షులు
దేశంలోని బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. పలు రాష్ట్రాల్లో చనిపోయిన పక్షుల్లో హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్‌ ఫ్లూయెంజా వైరస్ పాజిటివ్ ఉందని నిర్ధారించారు.

దేశంలోని బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. పలు రాష్ట్రాల్లో చనిపోయిన పక్షుల్లో హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్‌ ఫ్లూయెంజా వైరస్ పాజిటివ్ ఉందని నిర్ధారించారు. ఈ వైరస్‌తో పెద్దసంఖ్యలో పక్షులు చనిపోతున్నాయి. దీంతో వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశగా చర్యలకు కేంద్రం ఉపక్రమించింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. వలస పక్షులు, ఆ తర్వాత వణ్యప్రాణుల్లో బర్డ్ ఫ్లూ బయటపడగా ఇప్పుడదని మాంసం కోసమే పక్షులను పెంచే పౌల్ట్రీలకు వ్యాపించింది.

కేరళ, హర్యానాలో పౌల్ట్రీలలో కేసులు నమోదయ్యాయి. కేరళలో బాతుల్లోనూ, హర్యానాలో పౌల్ట్రీలో వైరస్ బయటపడింది. ఇంత వరకూ బర్డ్ ఫ్లూ మనుషులకు వ్యాప్తి చెందినట్టు ఎలాంటి కేసు ఇండియాలో నమోదు కాలేదు. ఈ వైరస్ పెంపుడు జంతువులు, పక్షులకు విస్తరించే అవకాశం ఉండటంతో అన్ని రాష్ట్రాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ కారణంగా ఇప్పటికే పెద్ద సంఖ్యలో పక్షులు చనిపోయాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్రం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేసింది. పరిస్థితిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి అనుమానం ఉన్నా బ్లడ్‌ శాంపుల్‌ తీసి భోపాల్‌ ల్యాబ్‌కు పంపుతున్నారు అధికారులు. ఇప్పటివరకు ఒక్క బర్డ్‌ ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో కోడి మాంసం సమృద్ధిగా ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం రావటం లేదు. దీంతో బర్డ్‌ ఫ్లూ ప్రమాదం లేదంటున్నారు అధికారులు.

మరోవైపు 2015 మాదిరిగానే ఇప్పుడు కూడా బర్డ్ ఫ్లూ కలకలం మొదలైన వెంటనే ప్రజలంతా చికెన్, గుడ్లు తినడానికి భయపడుతున్నారు. అయితే గుడ్లు, చికెన్‌ తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని కేంద్రం ప్రకటించింది. అయితే వీటిని వండుకునేటప్పుడు పూర్తిగా ఉడకించాలన్నారు. బర్డ్‌ ఫ్లూ అనేది ఇండియాకు కొత్తేమీ కాదని, 2015 నుంచి ప్రతి శీతాకాలంలో బర్డ్ ఫ్లూ కేసులు దేశంలో నమోదవుతూనే ఉన్నాయని తెలిపారు.

గత కొన్ని వారాలుగా యూరోపియన్‌ దేశాల్లో కూడా బర్డ్‌ఫ్లూ ప్రభావం కనిపిస్తోంది. నెదర్లాండ్స్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, బెల్జియం, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, డెన్మార్క్‌, స్వీడన్‌, పోలండ్‌, క్రొయేషియా, ఉక్రెయిన్‌లలో బర్డ్‌ఫ్లూను కనుగొన్నామని యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ -ఈసీడీసీ వెల్లడించింది. ఫ్రాన్స్‌లో సుమారు ఆరు లక్షలకు పైగా పౌల్ట్రీ పక్షులను వధించారు. జర్మనీలో 62వేల టర్కీ, బాతులను వధించినట్లు అధికారులు తెలిపారు. ఈ వైరస్‌ పక్షుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి మానవుల మధ్య సంక్రమించే అవకాశం లేదని వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story