కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజు బొమ్మై

Basavaraj Bommai

Basavaraj Bommai

Karnataka: కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజు బొమ్మై పేరును ఖరారు చేశారు.

Karnataka: యడియూరప్ప రాజీనామాతో కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. కర్నాటక ముఖ్యమంత్రి పీఠం మరోసారి లింగాయత్‌ వర్గానికి చెందిన నేతనే వరించింది.. యడియూరప్ప వారసుడిగా బవసరాజు సోమప్ప బొమ్మైని బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.. సుదీర్ఘంగా సాగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా బొమ్మైని తమ నేతగా ఎన్నుకున్నారు.

రెండు రోజుల కిందనే కర్నాటక ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేశారు. గవర్నర్ కూడా యడియూరప్ప రాజీనామాకు ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం తదుపరి సీఎంగా బసవరాజు బొమ్మైని నియమించింది.. కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌, యడియూరప్ప సమక్షంలో సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది.. శాసనసభా పక్ష సమావేశం అనంతరం యడియూరప్పకు బసవరాజ్‌ బొమ్మై కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు పాదాభివందనం చేశారు.

బవసరాజ్‌ బొమ్మై రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఆర్‌ బొమ్మై కుమారుడిగా గుర్తింపు ఉంది. లింగాయత్‌ సామాజికవర్గానికి చెందిన నేత కావడం కలిసొచ్చిన అంశం.. 1960 జనవరి 28న హుబ్లీలో జన్మించిన బసవరాజ్‌ బొమ్మై... మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివారు. జనతాదళ్‌ పార్టీ నుంచి రాజకీయాల్లో అడుగు పెట్టారు. 2008లో జనతాదళ్‌ను వీడి బీజేపీలో చేరారు.. పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా బసవరాజ్‌ బొమ్మైకి పేరుంది.. షిగ్గావ్‌ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. 1998, 2004లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

ప్రస్తుతం కర్నాటక హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బసవరాజ్‌ బొమ్మై.. హవేరి, ఉడిపి జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌గా మంత్రిగా పనిచేశారు. దీంతోపాటు న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాలను కూడా ఆయన చూస్తున్నారు. యడియూరప్పకు బసవరాజ్‌ బొమ్మై అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు.. యడియూరప్ప సైతం తదుపరి ముఖ్యమంత్రిగా బసవరాజ్‌ బొమ్మై పేరును అధిష్ఠానానికి సూచించినట్లుగా ఊహాగానాలు వినిపించాయి.

Tags

Read MoreRead Less
Next Story