కోవాగ్జిన్‌ ఆమోదానికి సంబంధించి కీలక అడుగు

కోవాగ్జిన్‌ ఆమోదానికి సంబంధించి కీలక అడుగు
దేశంలో కరోనా టీకా వినియోగం, అనుమతుల విషయంపై ఆదివారం కీలక ప్రకటన చేయనుంది డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా.

స్వదేశీ తొలి వ్యాక్సిన్‌గా భావిస్తున్న కోవాగ్జిన్‌ ఆమోదానికి సంబంధించి కీలక అడుగు పడింది. కోవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీఓ అనుమతి లభించింది. దేశీయ ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కోవాగ్జిన్‌ టీకా అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ ఆమోద ముద్ర వేసింది. కోవాగ్జిన్‌ టీకా అత్యవసర వినియోగానికి షరతులతో కూడిన ఆమోదం తెలపాలని భారత ఔషధ నియంత్రణ సంస్థ.. డీసీజీఐకి సిఫారసు చేసింది. ఆక్స్‌ఫర్డ్‌ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ అత్యవసర వినియోగానికి అనుమతికి సిఫారసులు చేసిన 24 గంటల్లోపే కోవాగ్జిన్‌కు అనుమతివ్వాలని నిపుణుల కమిటీ భావించింది.

కోవిషీల్డ్‌ను ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనికా సంయుక్తంగా అభివృద్ధి చేయగా..భారత్‌కు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. కోవాగ్జిన్‌ పూర్తిగా దేశీయంగా రూపొందిన కోవిడ్ టీకా. భారత వైద్య పరిశోధనా మండలి, పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ వైరాలజీల భాగస్వామ్యంతో భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్‌ను అభివృద్ధి చేసింది. సీడీఎస్​సీఓ నిపుణుల కమిటీ చేసిన సిఫారసును డీసీజీఐ అనుమతించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కోవాగ్జిన్‌ టీకా పంపిణీని ప్రారంభించనుంది. డిసెంబర్‌ 9, డిసెంబరు 30న సీడీఎస్​సీఓ నిపుణుల కమిటీ.. భారత్‌ బయోటెక్‌ను టీకాపై అదనపు సమాచారం కోరింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ సహా భారత్‌ బయోటెక్‌ సమర్పించిన అదనపు సమాచారాన్ని క్రోడీకరించి సుధీర్ఘంగా విశ్లేషించిన నిపుణుల కమిటీ షరతులతో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. జైడస్ క్యాడిలా హెల్త్ కేర్ లిమిటెడ్‌కు మూడో దశ క్లినికల్ ట్రయల్ ప్రోటోకాల్ నిర్వహించడానికి అనుమతించాలని కూడా నిపుణుల కమిటీ సిఫారసు చేసింది.

ఇక దేశంలో కరోనా టీకా వినియోగం, అనుమతుల విషయంపై ఆదివారం కీలక ప్రకటన చేయనుంది డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఉదయం 11 గంటలకు డీసీజీఐ డైరెక్టర్ జనరల్ మాట్లాడనున్నారు.భారత్‌లో కరోనా వ్యాక్సిన్ల వినియోగం, అనుమతులపై డీసీజీఐ కీలక ప్రకటన చేయనుంది. టీకా అందుబాటులోకి వచ్చే విషయంపై వివరాలు వెల్లడించనున్నారు. అటు.. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రై రన్ కొనసాగింది.


Tags

Read MoreRead Less
Next Story