12వ బ్రిక్స్ సదస్సు వేదికగా పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ

12వ బ్రిక్స్ సదస్సు వేదికగా పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ

12వ బ్రిక్స్ సదస్సు వేదికగా పాకిస్థాన్‌పై, అంతర్జాతీయ వ్యవస్థల తీరుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలితోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలను సంస్కరించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉగ్రవాదం ప్రపంచంలో అతి పెద్ద సమస్యగా పేర్కొన్న మోదీ.. ఉగ్రవాదానికి మద్దతిచ్చే, నిధులు సమకూర్చే అన్ని దేశాలను జవాబుదారీ చేయాలని స్పష్టం చేశారు.

పాకిస్థాన్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఉగ్రవాదమే ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్‌ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికాతో కూడిన బ్రిక్స్ సదస్సు రష్యా అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ వర్చువల్ సమావేశంలో ప్రసంగించిన మోదీ.. ఉగ్రవాదులకు మద్దతిచ్చే దేశాలపై చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యవహరించే దేశాల్ని జవాబుదారీ చేయడంతో పాటు వాటిని దోషులుగా నిలబెట్టాలని అన్నారు. ఉగ్రవాదంపై బ్రిక్స్‌ దేశాలన్నీ ఉమ్మడిగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మోదీ వ్యాఖ్యలను రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ సమర్థించారు.

అటు..పలు అంతర్జాతీయ సంస్థల్లో కాలనుగుణంగా మార్పులు లేవని మోదీ అన్నారు. 75 ఏళ్ల నాటి ఆలోచనా విధానం, నాటి పరిస్థితుల ఆధారంగా పని చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి, ఐఎంఎఫ్‌, డబ్ల్యూటీవో, డబ్ల్యూహెచ్‌వో వంటి సంస్థల్ని సంస్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు అనివార్యమని, ఇందుకు బ్రిక్స్‌ దేశాల మద్దతును భారత్‌ కోరుతున్నట్టు చెప్పారు.

ప్రపంచ జనాభాలో 42 శాతం బ్రిక్స్ దేశాల్లో ఉందని, కోవిడ్-19 మహమ్మారి అనంతరం ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో ఈ దేశాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. పరస్పరం వాణిజ్యాన్ని పెంచుకునే అవకాశాలు చాలా ఉన్నాయని అన్నారు. 150కి పైగా దేశాలకు భారత్‌ ఔషధాలను అందించిందని చెప్పారు. వ్యాక్సిన్‌ను కూడా మానవతా దృక్పథంతో సరఫరా చేస్తామని తెలిపారు. సరఫరా వ్యవస్థ మెరుగుదలకు భారత్‌ ఆత్మనిర్భర్‌ విధానం ఎంతగానో దోహదం చేసిందని బ్రిక్స్‌ సదస్సులో మోదీ ప్రస్తావించారు.

Tags

Read MoreRead Less
Next Story