తెలంగాణ-ఏపీ మధ్య నిర్మించిన భారీ వంతెనకు మోక్షం..

తెలంగాణ-ఏపీ మధ్య నిర్మించిన భారీ వంతెనకు మోక్షం..

ఆరున్నరేళ్ల నిరీక్షణకు రేపటితో తెరపడనుంది.. సూర్యాపేట జిల్లా సరిహద్దుల్లో మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం సమీపంలోని కృష్ణానదిపై తెలంగాణ-ఏపీ మధ్య నిర్మించిన భారీ వంతెనకు ఎట్టకేలకు మోక్షం కలిగింది.. ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడం ద్వారా సూర్యాపేట-గుంటూరు జిల్లాల మధ్య దూరం మరింత తగ్గనుంది.. ఇరు రాష్ట్రాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత పెరుగుపడనున్నాయి.

2014 జనవరిలో 50 కోట్ల రూపాయల అంచనాలతో అప్పటి మంత్రి గీతారెడ్డి చేతుల మీదుగా బ్రిడ్జికి పునాది రాయి పడింది.. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఈ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు.. మూడేళ్లలో పూర్తిచేసేలా ఒప్పందం చేసుకుంది అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం.. శంకుస్థాపన చేసిన ఐదు నెలలకే టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది. అయితే, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పనులు ముందుకు సాగలేదు.. రెండోసారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రిడ్జి నిర్మాణం పరుగులు పెట్టింది.. అప్రోచ్‌ రోడ్‌ విషయంలో ఆర్‌ అండ్‌ బీ, అటవీ శాఖకు మధ్య విభేదాలు తలెత్తడంతో హుజూరాబాద్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి పరిష్కరించారు.. దీంతో బ్రిడ్జి నిర్మాణానికి ముందడుగు పడింది.. అన్ని ఆటంకాలు పూర్తిచేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది.. ఏపీ నుంచి పత్తి, మిరప వంటి పంటల రవాణాకు, తెలంగాణ నుంచి సిమెంటు రవాణాకు మరింత సులభతరం కానుంది.

అంతేకాదు, ప్రముఖ పుణ్యక్షేత్రమైన మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.. శుక్ర, శనివారాల్లో భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది. గతంలో బల్లకట్టుపై ప్రయాణం సాగించాల్సి వచ్చేది.. ఈ బ్రిడ్జి నిర్మాణం తమకు ఓ వరం లాంటిదని ప్రజలంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story