రాఖీకి అసలైన అర్ధం... అక్కకి తమ్ముడి కిడ్నీ దానం..!

రాఖీకి అసలైన అర్ధం... అక్కకి తమ్ముడి కిడ్నీ దానం..!
కిడ్నీ సమస్యతో గత కొంతకాలంగా మా అక్కయ్య నరకయాతన చూసింది. ఆమెకు నా కిడ్నీ సరిపోతుందని డాక్టర్లు చెప్పడంతో నేను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.

రక్షాబంధన్ అంటే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక మాత్రమే కాదు.. కష్టసుఖాల్లో ఎప్పుడూ రక్షగా ఉంటానని చెప్పడం కూడా.. అలా ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన సోదరిని రక్షించుకొని రాఖీకి అసలైన అర్ధం చెప్పాడు ఓ సోదరుడు. ఈ ఘటన హరియాణాలోని చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రోహ్‌తక్‌కు చెందిన 31ఏళ్ల మహిళ గత అయిదేళ్ళుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతుంది. దీనిని ఆమె త్వరగా గుర్తించకపోవడంతో ఆమె రెండు కిడ్నీలు పాడైపోయాయి.

మరోవైపు హైబీపీ కారణంగా ఆమె గుండె బలహీనంగా మారింది. దీనితో ఆమెను ఢిల్లీలోని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ తొందరగా ఆమెకి కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. కిడ్నీ ఇచ్చేందుకు ముందుగా ఆమె భర్త ముందుకు వచ్చాడు. కానీ బ్లడ్‌గ్రూప్‌ సరిపోలేదు. ఆ తర్వాత ఆమె తమ్ముడు ముందుకు రాగా అతడికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతడి కిడ్నీని మహిళకు అమర్చారు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె సోదరుడు మాట్లాడుతూ.. "కిడ్నీ సమస్యతో గత కొంతకాలంగా మా అక్కయ్య నరకయాతన చూసింది. ఆమెకు నా కిడ్నీ సరిపోతుందని డాక్టర్లు చెప్పడంతో నేను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నా జీవితంలో ఆమె నాకు ఎంతో విలువైనది. ఇక ఆమె సంతోషంగా ఉంటుందని భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.

Tags

Read MoreRead Less
Next Story