వరి పంట.. రోడ్డు పక్కన కూడా వేసుకోవచ్చునంట

వరి పంట.. రోడ్డు పక్కన కూడా వేసుకోవచ్చునంట
నేల తల్లిని, పచ్చని పైరులను ప్రేమించే అనిల్‌కి రోడ్డు పక్కన ఖాళీగా పిచ్చి మొక్కలతో ఏపుగా పెరిగిన స్థలం కనిపించింది.

ఉద్యోగం లేదు.. ఊరికి ఏదైనా చేద్దామంటే ఏం చేయాలో పాలు పోలేదు.. వ్యవసాయం చేద్దామన్నా నాలుగు గోడల ఇల్లు తప్ప ఇంటి ముందు నాలుగు అడుగుల స్థలం లేదు, తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్థి అసలే లేదు. రోడ్డు మీద నడుస్తూ ఆలోచిస్తుంటే రోడ్డు పక్కన స్థలం ఖాళీగా కనిపించింది. అంతే.. తన ఆలోచనను రోడ్డు పక్కకు మళ్లించాడు. అక్కడే పెరటి మొక్కల పెంపకాన్ని ప్రారంభించాడు..

కేరళలోని త్రిచూర్‌కు చెందిన అనిల్ కుమార్. ప్రైవేట్ బస్ డ్రైవర్‌గా పని చేస్తున్న అతడికి ఉద్యోగం పోవడంతో ఖాళీగా ఉన్నాడు. వ్యవసాయం చేయాలనుకున్నాడు.. అందుకు రోడ్డు పక్కన స్థలాన్నే ఎంచుకున్నాడు. నేల తల్లిని, పచ్చని పైరులను ప్రేమించే అనిల్‌కి రోడ్డు పక్కన ఖాళీగా పిచ్చి మొక్కలతో ఏపుగా పెరిగిన స్థలం కనిపించింది. ఆ నేలలోనే కూరగాయల మొక్కలను ఇష్టంగా పెంచడం ప్రారంభించాడు.

ఊరి పంచాయితీ గమనించి ఇదేం పనయ్యా బాబు అని అడిగింది.. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించను.. పైగా నేను పండించిన కూరగాయలు ఊరి వాళ్లందరూ తీసుకోవచ్చన్నాడు.. ఆ మాటకు మెచ్చిన పంచాయితీ ప్రెసిడెంట్ ప్రభుత్వం తరపు నుంచి మొక్కలు తెప్పించి మరీ ఇచ్చారు.. విత్తనాలు సరఫరా చేసారు. ఏ మందులూ వేయకుండానే ఏపుగా కాసిన కూరగాయలను ఊరి వారందరికీ ఉచితంగా పంచి ఇస్తున్న అనిల్ అంటే ఊరి వారికి గౌరవం పెరిగింది. .

ఆ ఉత్సాహంతోనే వరి పండించాలనుకున్నాడు.. చాలు చాల్లేవయ్యా.. దుక్కీ దున్నీ.. మందులూ, మాకులూ వేస్తే కానీ పండని వరి పంటని రోడ్డు మీద పండిస్తావా అని నిరుత్సాహ పరిచిన వాళ్లూ ఉన్నారు. అయినా వారి మాటల్ని లెక్క చేయక వరి సాగూ ప్రారంభించాడు.. వరి కంకులు వచ్చే పోయే వారిని పలకరిస్తూ.. చూడముచ్చటగా మారిన రోడ్డు చూపరులను ఆకట్టుకుంటోంది.. దాంతో ఊళ్లో వాళ్లందరికీ అనిల్ రోడ్ సైడ్ వ్యవసాయం మీద గురి కుదిరింది. ఇలా ప్రతి ఊళ్లో చేయవచ్చు.. ఆ సందేశం అందించడానికే ఈ పని చేస్తున్నాను అంటాడు అనిల్.

........................................

Tags

Read MoreRead Less
Next Story