అంత్యక్రియలకు సిద్ధమవుతున్న వేళ.. అమ్మ పిలుపువిని ఆగిన గుండె కొట్టుకుంది..

అంత్యక్రియలకు సిద్ధమవుతున్న వేళ.. అమ్మ పిలుపువిని ఆగిన గుండె కొట్టుకుంది..
ఆమె ఆరేళ్ల కుమారుడిని 20 రోజుల క్రితం వైద్యులు చనిపోయినట్లు ప్రకటించారు.

అమ్మ గుండెలవిసేలా రోదిస్తోంది. దేవుడు ఆమె రోదన విన్నాడో ఏమో తిరిగి అతడికి ప్రాణం పోశాడు. ఆమె ఆరేళ్ల కుమారుడిని 20 రోజుల క్రితం వైద్యులు చనిపోయినట్లు ప్రకటించారు. కుటుంబం అంత్యక్రియలకు సిద్ధమవుతోంది. మరణించిన కొడుకు తలపై ముద్దు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ లే నాన్నా లే అని పదే పదే అంటోంది.

దీంతో అతడి శరీరం కదలడం ప్రారంభించింది. కొడుకు ఊపిరి ఆడుతోంది అని తండ్రి పరుగు పరుగున అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు ఆశ్చర్యపోతూ మళ్లీ చికిత్స ప్రారంభించారు. మంగళవారం అతను రోహ్తక్ ఆసుపత్రి నుండి తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఇది అద్భుతం కాకపోతే మరేమిటి అని అంటున్నారు స్థానికులు.

ఈ సంఘటర హర్యానాలోని బహదూర్‌గర్‌లో జరిగింది. స్థానికంగా నివసిస్తున్న హితేష్ మరియు అతని భార్య హన్వి, తమ కొడుకుకు టైఫాయిడ్ వచ్చిందని చెప్పారు. చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు. మే 26 న వైద్యులు అతడు చనిపోయినట్లు ప్రకటించారు. తల్లిదండ్రులు రోదిస్తూ కొడుకు మృతదేహాన్ని తీసుకుని బహదూర్‌గర్‌కు తిరిగి వచ్చారు.

బాబు తల్లి హన్వి, ఆంటీ అన్నూ ఏడుస్తూ, మృతదేహాన్ని ప్రేమతో పదేపదే తడుతూ సజీవంగా ఉండమని పిలిచారు. కొంత సమయం తరువాత ప్యాక్ చేసిన శరీరంలో కదలికను గమనించారు వాళ్లు. బాబు తండ్రి హితేష్ షీట్ ప్యాకింగ్ నుండి పిల్లవాడిని వేరు చేసి నోటికి ఆక్సిజన్ అందించాడు. పొరుగున ఉన్న వ్యక్తి సునీల్ సినిమాల్లో చూసినట్లుగా పిల్లవాడి ఛాతీపై ఒత్తిడి పెట్టడం ప్రారంభించారు. ఇంతలో నోటి ద్వారా శ్వాస అందిస్తున్న తండ్రి పెదవిని పిల్లవాడు కొరికాడు. దాంతో తండ్రి హితేష్‌కి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది.

వెంటనే కొడుకుని తీసుకుని రోహ్తక్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. అయితే పిల్లవాడిని చూసిన వైద్యులు బ్రతకడానికి 15 శాతం మాత్రమే అవకాశం ఉందని చెప్పారు. చికిత్స ప్రారంభమైంది. అమ్మ చేసుకున్న పుణ్యమో, వైద్యులు చేసిన చికిత్సనో బాబు త్వరగా కోలుకున్నాడు. ఇప్పుడు అతను పూర్తిగా కోలుకొని మంగళవారం ఇంటికి చేరుకున్నాడు.

ఇప్పుడు పిల్లవాడి తండ్రి హితేష్ తన కొడుకు పెదవిపై చేసిన గాయాన్ని చూపించి సంబరాలు చేసుకుంటున్నాడు. అదే సమయంలో, తాత విజయ్ దీనిని ఒక అద్భుతం అని అంటున్నాడు. దేవుడు మళ్ళీ తన కొడుకులో ఊపిరి నింపాడని తల్లి ఆనందం నిండిన కళ్లతో కొడుకుని చూసుకుని మురిసిపోతోంది. కుటుంబం మాత్రమే కాదు, మొత్తం గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story