కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్‌

కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్‌

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. లాక్‌ డౌన్‌ కారణంగా వ్యాపార సంస్థలు, ఉద్యోగులు తీవ్ర సంక్షోభానికి గురైన నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు ఆత్మ నిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన కార్యక్రమానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.. కొత్త ఉద్యోగులను నియమించుకునే విధంగా వ్యాపార సంస్థలను ప్రోత్సహించేందుకు 22,810 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.. ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి 1584 కోట్ల రూపాయలు కేటాయిస్తూ తీర్మానించింది. దీనివల్ల 58.5 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ తెలిపారు.

టెలికాం రంగంలో సంస్కరణలకు కేంద్రం తెరలేపింది. దేశంలో పబ్లిక్‌ డేటా సెంటర్లు ప్రారంభించాలని నిర్ణయించింది. వీటికి లైసెన్సు ఫీజుగానీ, రిజిస్ట్రేషన్‌ ఫీజుగా అవసరం లేదని కేంద్ర కేబినెట్‌ సమావేశంలో తీర్మానించారు. పబ్లిక్‌ డేటా సెంటర్ల ద్వారా వైఫై సేవలు అందించేందుకు వీలుగా రూపొందించిన పీఎం వైఫై యాక్సెస్‌ నెట్‌ వర్క్‌ ఇంటర్‌ఫేస్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే కొచ్చి-లక్షద్వీప్‌ మధ్య ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ కనెక్టివిటీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈశాన్య ప్రాంతానికి సమగ్ర టెలికాం అభివృద్ధి ప్రణాళిక ప్రకారం అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోంలోని రెండు జిల్లాల్లో మొబైల్‌ కవరేజ్‌ అందించడానికి యూఎస్‌ఓఎఫ్‌ పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story