కరోనా వ్యాక్సిన్ ధరలను ప్రకటించిన కేంద్రం.. ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగానే.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయితే..!

కరోనా వ్యాక్సిన్ ధరలను ప్రకటించిన కేంద్రం.. ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగానే.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయితే..!
మార్చి ఒకటి నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ కు కేంద్రం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే కరోనా వ్యాక్సిన్ ధరలను ప్రకటించింది.

మార్చి ఒకటి నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ కు కేంద్రం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే కరోనా వ్యాక్సిన్ ధరలను ప్రకటించింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో టీకా డోసు ధర 250 రూపాయలుగా నిర్ణయించగా.. ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగానే వ్యాక్సిన్ అందించనుంది. ఈ మేరకు శనివారం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

వాస్తవానికి ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా ధర 150 రూపాయలు కాగా.. సర్వీసు చార్జీగా మరో 100 రూపాయలు వసూలు చేయనున్నాయి. దీంతో ఒక్క డోసు ధర రూ.250 అయింది. రెండో విడత వ్యాక్సినేషన్‌ కోసం టీకా కంపెనీల నుంచి ఒక్కో డోసును 167 రూపాయలకే కొనుగోలు చేయనుంది. ఈ ధరలో కొంత రాయితీ ఇచ్చి 150 రూపాయలకే ప్రైవేటు ఆస్పత్రులకు సమకూర్చనుంది.

60 ఏళ్లు పైబడిన వారు.. 45-59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి రెండో విడతలో వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇందుకోసం కోవిన్ 2.0 యాప్ లో పేరు నమోదుచేసుకోవాలి. యాప్ లో అన్ని వివరాలు పొందుపరచాలి. టీకా తీసుకోవాలనుకునే వారు సమయం, తేదీతో కూడిన స్లాట్ ను బుక్ చేసుకోవాలి. ఒక ఫోన్ నంబర్ మీద నలుగురు వ్యాక్సిన్ బుక్ చేసుకోవచ్చు.

మార్చి 1న ఉదయం 10 నుంచి 11.30 గంటల మధ్య దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభం కానుంది. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story