National News: మీ వాహనం 20 ఏళ్లు పాతదా..? అయితే ఇక ప్రభుత్వం చేతికే..

National News: మీ వాహనం 20 ఏళ్లు పాతదా..? అయితే ఇక ప్రభుత్వం చేతికే..
National News: దేశంలో వాహన కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం తెస్తున్న తుక్కు విధానం ఆందోళన కలిగిస్తోంది.

National News: దేశంలో వాహన కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం తెస్తున్న తుక్కు విధానం ఆందోళన కలిగిస్తోంది. దీని ప్రకారం రెండుకోట్ల 80 లక్షల వాహనాలు తుక్కుగా మారబోతున్నాయి. ఇలా చేస్తే వాయుకాలుష్య నియంత్రణతో పాటు ఆటో మొబైల్‌ పరిశ్రమకు బూస్టప్ వస్తుందని కేంద్రం భావిస్తోంది. కొత్త విధానం ప్రకారం పదిహేనేళ్లకు పైబడిన ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందడంలో విఫలమైతే.. 2023 ఏప్రిల్‌ ఒకటో తేదీనుంచి వాటి రిజిస్ట్రేషన్‌ రద్దయిపోతుంది.

ఇరవైఏళ్లకు మించి వాడకంలో ఉన్న వ్యక్తిగత వాహనాలకూ 2024 జూన్‌ నుంచి ఇదే షరతు వర్తిస్తుంది. వచ్చే రెండేళ్లలో 300 తుక్కు కేంద్రాలను దేశంలో పెట్టబోతోంది కేంద్రం. తుక్కు విధానంలో పాతకారును తీసేయాలనుకున్న వారికి లక్ష, లక్షన్నర రూపాయల దాకా రాయితీలు ముట్టజెప్పాలని నిర్ణయించారు. ఫ్రాన్స్‌, జపాన్‌, యూకే లాంటిచోట్లా ఇలానే చేస్తారు.

విదేశాల్లో పరిస్థితులు, మన పరిస్థితులు వేరు. అది అక్కడ చెల్లుబాటయింది గానీ, మన దగ్గర భిన్నమైన పరిస్థితి. సామాన్యులు రూపాయి, రూపాయి వెనుకేసుకుని బైకో, కారో కొనుక్కుంటారు. కారైతే జీవితానికి ఒక్కటే. కొందరైతే తాతా, తండ్రులు వాడిన సైకిళ్లు, బైకులు ఇప్పటికీ వాడుతుంటారు. వాహనం మోడల్‌ పాతబడి మోజు తీరగానే దాన్ని వదిలించుకుని మరొకటి కొనాలనే ఆలోచన, స్థోమత లేని సామాన్యులు కోట్ల సంఖ్యలో ఉన్న భారత్‌లో తుక్కు ప్రతిపాదన ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

కేంద్రమిచ్చే రాయితీలకు ఆశపడి పాత వాహనాల్ని వదిలిపెట్టి కొత్తవి కొనే ఆర్థిక స్థోమత ఎంతమందికి ఉందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నేళ్ల క్రితం వాహనం కొన్నారన్న దాన్ని బట్టి వాహనాల వినియోగ యోగ్యతను ఎలా నిర్ధారిస్తారనేది నిపుణుల ప్రశ్న. ఎంతదూరం తిరిగారన్న ప్రాతిపదికన వాహనం అరుగుదలను లెక్కించాలని వాళ్లు సూచిస్తున్నారు. ఏ ప్రాంతంలో ఎలాంటి రహదారులపై వాహనాలు నడుస్తున్నాయి, డ్రైవర్‌ నైపుణ్యం, బండి కండీషన్ లాంటి వాటిని పరిగణలోకి తీసుకోవాలి.

కేంద్రం అమలుపరుస్తామంటున్న తుక్కు విధానం రూపకల్పన ప్రక్రియలో ఏ దశలోనూ సరైన కసరత్తు చేపట్టినట్లు కనిపించడం లేదు. కొనుగోలు తేదీనిబట్టి వాహనం గడువు తీరిందంటూ భారీగా ఛార్జీల వడ్డనతో మోతెక్కించడానికే ప్రభుత్వం సిద్ధపడితే- ప్రజా వ్యతిరేకత తప్పదు. కాలం చెల్లినవనే ముద్రవేసి వాహనాన్ని తిరుగాడకుండా చేయాలన్న ప్రతిపాదనలు.. గతంలో ఢిల్లీ, ముంబై, కోల్‌ కతా తదితర నగరాల్లో వచ్చింది. కానీ దీనికి పెద్దఎత్తున ప్రజాగ్రహం వ్యక్తమైంది.

వ్యక్తిగత వాహనాలను పరిమితంగా అనుమతిస్తూ ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరచడంలో సింగపూర్‌ ముందుంది. ఐస్ లాండ్‌, కెనడా, ఫిన్లాండ్‌ దేశాల్లోనూ విధానాలు బాగున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ.. కాలుష్యాన్ని నియంత్రిస్తున్నాయి. కానీ మన దగ్గర మాత్రం తుక్కు విధానాన్ని తెచ్చారు. నిర్ణీత కాలపరిమితి తీరిన వాహనాల్ని తుక్కుగా జమకడితే.. లారీలు, వ్యాన్లు, ట్యాక్సీలు, ఆటోలు భారీ సంఖ్యలో మూలన పడుతాయి. కోట్లాది బతుకులు పేదరికంలోకి వెళ్లిపోతాయి.

కరోనా కష్టాల నుంచి కోలుకోని సామాన్యులపై మరో పిడుగు పడబోతోంది. వాహనాల రిజిస్ట్రేషన్‌ ధరలు భారీగా పెరగబోతున్నాయి. ప్రస్తుతం టూ వీలర్ రిజిస్ట్రేషన్ రెన్యూవల్ కు 300 రూపాయలు, కారుకు 600 తీసుకుంటున్నారు. కానీ కొత్త ఛార్జీల ప్రకారం బైకుకు వెయ్యి, కారుకు ఏకంగా 5వేల రూపాయలు ముక్కుపిండి వసూలు చేయబోతున్నారు. కొత్త ఛార్జీలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ట్రక్కు లేదా బస్సు ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ పత్రం రెన్యువల్ రేటును 15వందల నుంచి 12వేలకు పెంచేశారు. అసలే కరోనాతో ఆర్థికంగా కుంగిపోయిన సామాన్యులపై కేంద్రం ఈస్థాయిలో దాడికి సిద్ధమవడంపై విమర్శలొస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story