బ్యాంకుల ప్రైవేటీకరణకు కేంద్రం వడివడిగా అడుగులు

బ్యాంకుల ప్రైవేటీకరణకు కేంద్రం వడివడిగా అడుగులు
బ్యాంకుల ప్రైవేటీకరణకు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటుపరం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

బ్యాంకుల ప్రైవేటీకరణకు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటుపరం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ జాబితాలో ఉన్నట్లు ఉన్నత అధికారుల సమాచారం. ఉద్యోగుల సంఖ్య ఆధారంగా ఈ బ్యాంకుల ఎంపిక జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. తొలుత చిన్న, మధ్య స్థాయి ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసి.. దీనిపై వచ్చే స్పందన ఆధారంగా పెద్ద బ్యాంకుల్ని కూడా విక్రయించాలని భావిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సదరు వర్గాలు తెలిపాయి

ఉద్యోగ సంఘాల లెక్కల ప్రకారం.. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 50వేలు. సెంట్రల్ బ్యాంకులో 33వేలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 26వేలు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 13వేల మంది చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు కేంద్రం ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఉద్యోగసంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే సోమవారం నుంచి రెండు రోజుల సమ్మెకు దిగారు.

ఈ ప్రక్రియ మొదలుపెట్టడానికి 5-6 నెలల సమయం పడుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉద్యోగులు, కార్మిక సంఘాల ఒత్తిళ్లు, రాజకీయ పరిణామాలు ఈ అంశాన్ని ప్రభావితం చేస్తాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఏదైనా బ్యాంకు ప్రైవేటీకరణ అంశం చివరి నిమిషంలో మారిపోయే అవకాశం ఉందని తెలిపాయి. అయితే చిన్న బ్యాంకుల విక్రయంతో అవసరమైన నిధులు సమకూరకపోతే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వంటి పెద్ద బ్యాంకులనూ విక్రయించేందుకు సిద్ధపడవచ్చని కొందరు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story