ఢిల్లీ శివార్లలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ

ఢిల్లీ శివార్లలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ
పలుచోట్ల రైతుల్ని అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తూ.. ఢిల్లీలో రైతులు గర్జించారు. రాజధాని శివార్లలోని టిక్రీ, సింఘూ, ఘాజీపూర్‌ల నుంచి అనుమతిచ్చిన సమయానికి ముందే రైతులు ట్రాక్టర్లతో ఎంటర్ అయ్యారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కొన్ని చోట్ల రణరంగాన్ని తలపించింది. రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనుమతించిన మార్గాలను దాటి రైతులు ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడమే ఉద్రిక్తతలకు కారణమైంది. వేల కొద్దీ ట్రాక్టర్లు తరలిరాగా.. కొన్ని చోట్ల రైతులు చేతిలో జెండాలు పట్టుకుని కదంతొక్కారు. పలుచోట్ల రైతుల్ని అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినప్పటికీ.. కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో.. సరిహద్దుల్లో బారికేడ్లను ధ్వంసం చేసుకుని ముందుకు కదిలారు.

సాగు చట్టాలపై కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు ముందుకు కదులుతున్నారు. ఢిల్లీ పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున చేరుకుని ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొంటున్నారు. ట్రాక్టర్‌ ర్యాలీ నేపథ్యంలో రైతు సంఘాలతో ఒప్పందం చేసుకున్న ఢిల్లీ పోలీసులు 5 వేల ట్రాక్టర్లు, 5 వేల మందికి మాత్రమే అనుమతిచ్చారు. కానీ.. ఈ రోజు ఉదయం నుంచే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఢిల్లీ సరిహద్దుల్లో ఎటు చూసినా రైతులు ట్రాక్టర్లలో భారీగా తరలివచ్చారు.

మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే ర్యాలీకి అనుమతి ఉందని పోలీసులు చెప్పినా రైతుల్ని నియంత్రించేందుకు పోలీసులు ఇబ్బందిపడ్డారు. కొన్ని చోట్ల రోడ్డుకు అడ్డంగా పెట్టిన కంటెయినర్లను రైతులు ట్రాక్టర్లతో నెట్టేశారు. మరీ ముఖ్యంగా రైతుల ఆందోళనకు కేంద్ర బిందువుగా ఉన్న సింఘూలో ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. కొన్ని చోట్ల పోలీసుల తీరుపై ఆగ్రహం చెందిన రైతులు.. వాటర్ కేనన్ల వాహనాలపైకి ఎక్కి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఆందోళనలు విరమించేది లేదని తెగేసి చెప్పారు. రైతుల ట్రాక్టర్ పరేడ్ నేపథ్యంలో.. ఢిల్లీలోని మెట్రో స్టేషన్లను మూసివేశారు.


Tags

Read MoreRead Less
Next Story