సీఎం పీఠం దక్కించుకోవడంలో వారసులకు కలిసొస్తున్న సమీకరణాలు

సీఎం పీఠం దక్కించుకోవడంలో వారసులకు కలిసొస్తున్న సమీకరణాలు
Cm Chair: దేశవ్యాప్తంగా పలు సందర్భాల్లో వారసులు, కుటుంబసభ్యులకు దక్కిన సీఎం ఛాన్స్‌

Cms Chair: రాజకీయాల్లో వారసత్వం చాలా కామన్. MLA పిల్లలు MLA కావడం, మంత్రి కుమారుడు మంత్రి కావడం లాంటివే కాదు.. CM కుమారుడు CM కావడం లాంటివి కూడా చాలానే జరిగాయి. తాజాగా ఈ కోవలోనే బసవరాజ్‌ బొమ్మై కర్నాటక ముఖ్యమంత్రి అవుతుండడం విశేషం. దేశంలో ఇప్పటి వరకూ ఇలాంటి ఘటనలు దాదాపు 20 ఉంటే.. వారసులు, వారి కుటుంబసభ్యులు CMలు అయిన వాటిల్లో కొన్ని మరింత ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి చూస్తే అక్కడ తండ్రీ కూతుళ్లు ముఖ్యమంత్రులు అయ్యారు.

ముఫ్తీ మహమ్మద్ సయ్యద్‌ తర్వాత ఆయన వారసురాలిగా మహబూబా ముఫ్తీ CM పీఠాన్ని అధిష్టించారు. ఇక బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్‌ CM అయితే.. ఆ తర్వాత కొన్ని అనూహ్య పరిణామాలతో లాలూ సతీమణి రబ్రీదేవి కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక తమిళనాడులో MGR ముఖ్యమంత్రి అయితే ఆయన మరణానంతరం ఆయన సతీమణి జానకి రామచంద్రన్‌ CM అయ్యారు. ఆ పదవిలో ఉన్నది కొద్ది రోజులే అయినా ఇలాంటి ఘట్టాలు చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయాయి.

ఇక తండ్రులు, కొడుకులు CMలు అయిన సందర్భాలు 14 ఉన్నాయి. ప్రస్తుతం 6 రాష్ట్రాల CMలుగా ఉన్న వారు వారసత్వంగా రాజకీయాల్లో పైకి వచ్చినవారే. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ తన తండ్రి బిజూ పట్నాయక్ వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయాల్లో ఎదిగారు. ప్రస్తుతం 3వ సారి ఒడిశా CMగా కొనసాగుతున్నారు. ఇక తమిళనాడులో M కరుణానిధి మరణం తర్వాత DMKకి సారధ్యం వహించిన స్టాలిన్ మొన్నటి ఎన్నికల్లో ఘన విజయం సాధించి CM అయ్యారు.

జార్ఖండ్‌ తొలి ముఖ్యమంత్రిగా శిబు సొరేన్‌ తనదైన మార్క్ వేస్తే.. ఆయన వారసుడు హేమంత్ సొరేన్ ఇప్పుడు ఆ రాష్ట్రానికి CMగా ఉన్నారు. అరుణాచల్‌లో ఫెమా ఖండు కూడా తండ్రి వారసత్వం నుంచి ముఖ్యమంత్రి అయినవారే. మేఘాలయలో PA సంగ్మా వారసుడిగా ప్రస్తుతం కాన్‌రాడ్ సంగ్మా CM అయ్యారు. ఏపీలో దివంగత CM వైఎస్సార్ కుమారుడిగా ఉన్న జగన్‌ సీఎం అయ్యారు. ఇక ఇప్పుడు కర్నాటక CMగా ప్రమాణస్వీకారం చేస్తున్న బసవరాజ్ బొమ్మై కూడా రాజకీయాల్లో ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకున్నారు. తన తండ్రి సోమప్ప రాచప్ప బొమ్మై -SR బొమ్మై 1988-89 కాలంలో కర్నాటక సీఎంగా చేస్తే.. మళ్లీ ఇన్నాళ్లకు ఆ కుటుంబం నుంచి బసవరాజ్ బొమ్మై ముఖ్యమంత్రి అయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story