దేశంలో కరోనా స్వైర విహారం

దేశంలో కరోనా స్వైర విహారం
సుమారు ఆరు నెలల తర్వాత రికార్డుస్థాయిలో 81,466 కేసులు నమోదుకాగా.. 469 మంది మృత్యువాత పడ్డారు.

దేశంలో కరోనా స్వైర విహారం చేస్తూనే ఉంది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన కేసులు తాజాగా రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. సుమారు ఆరు నెలల తర్వాత రికార్డుస్థాయిలో 81,466 కేసులు నమోదుకాగా.. 469 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య కోటి 23లక్షల 3వేల 131కు చేరగా.. మరణాల సంఖ్య లక్షా 63వేల 396కు చేరుకుంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండడంపై కేంద్ర ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తంచేస్తోంది.

తాజాగా 50,356 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కోటి 15లక్షల 25వేల 39 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 6లక్షల 14వేల 696 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక క్రియాశీల రేటులో కూడా పెరుగుదల కనిపిస్తుడడం కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. రికవరీ రేటు కూడా 93.89శాతానికి తగ్గింది. కేసుల పెరుగుదలతో అప్రమత్తమైన కేంద్రం.. కేసులు ఉధృతి ఎక్కువగా ఉన్న 11 రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశమైంది. వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది.

దేశంలో ఎక్కువ కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రాన్ని కరోనా పట్టి పీడిస్తోంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా కేసులు మహారాష్ట్రలోనే నమోదుకావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నిన్న ఆ రాష్ట్రంలో 43, 183 మందికి పాజిటివ్ రాగా.. 249 మంది మరణించారు. మొత్తంగా 28లక్షల మందికి పైగా ప్రజలకు కరోనా సోకింది.

కరోనాతో బాధపడుతున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్కూలర్ వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరారు. ముందు జాగ్రత్తగా ఆస్పత్రిలో చేరానని.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోనున్నట్లు సచిన్ ట్వీట్ చేశాడు. కొన్ని రోజుల్లోనే ఇంటికి తిరిగి వచ్చేస్తానని ధీమా వ్యక్తంచేశాడు. మార్చి 27న సచిన్ కు కరోనా పాజిటివ్ రాగా.. అప్పటి నుంచి హోం ఐసోలేషన్ లో ఉన్నారు.

ఇక వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇప్పటివరకు 6కోట్ల 87లక్షల 89వేల 183 డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఏప్రిల్ ఒకటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు అందిస్తున్నారు. నిన్న ఒక్కరోజే 36లక్షల 71వేల 242 మందికి టీకా వేశారు.


Tags

Read MoreRead Less
Next Story